Oct 19,2022 22:21

లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
అధికారులను ఆదేశించిన కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కమిషనర్‌ నగరంలోని తేనబండ వీరబ్రహ్మస్వామి ఆలయం వద్ద నీవానదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలు, నీవా నది పరివాహక ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు. మరికొన్ని రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు నేపథ్యంలో.. నగరపాలక ప్రజారోగ్య, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బంది అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. నీవా నదిలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ స్థానిక ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షపు నీరు నిలువకుండా వెళ్ళేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. కమిషనర్‌ వెంట ఎంహెచ్వో అనిల్‌ కుమార్‌, డీఈ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, వార్డు కార్యదర్శులు ఉన్నారు.