అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో లోకల్, నాన్ లోకల్ వివాదం రాజుకుంటోంది. అధికారపార్టీలో మొదలైన అసమ్మతి రాగం ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి తాకుతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఈ అంశం తెరపైకి వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ వచ్చిన నినాదం ఇప్పుడూ మొదలైంది. అది సొంత పార్టీల నుంచే వస్తుండటం గమనార్హం.
హిందూపురం వైసిపిలో ఇన్‌ఛార్జీగానున్న మహమ్మద్ ఇక్బాల్‌కు స్థానిక వైసిపి నాయకులే స్థానికేతరులంటూ నాన్‌లోకల్ సమస్యను ముందుకు తెచ్చారు. ఐపిఎస్ రిటైర్డు ఉద్యోగి అయిన మహమ్మద్ ఇక్బాల్ 2019 ఎన్నికలకు ముందు హిందూపురం నియోజకవర్గానికి వైసిపి టిక్కెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓటమి చెందారు. అయితే ఆ తరువాత కూడా నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా ఉన్నప్పటికీ స్థానిక నాయకులకు, ఆయనకు మధ్య విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్టు ఇవ్వాలని మైనార్టీలు ప్రదర్శనలు చేపట్టారు. ఈ సమయంలో ఆయన స్థానికేతరుడంటూ అసమ్మతివర్గం పాత నినాదాన్నే మరోమారు ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ మొదలైన ఈ నినాదం క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలోనూ మంత్రి ఉషచరణ్ శ్రీకి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపు నాన్ లోకల్ నినాదాన్ని తీసుకొచ్చింది. స్థానికులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్‌ను వినిపిస్తోంది. ఉషచరణ్ శ్రీ 2019 ఎన్నికలకు ముందే వైసిపిలో చేరారు. మొదటి ఎన్నికలోనే గెలుపొందారు. ఆ తరువాత మంత్రి అయ్యారు. మంత్రి కూడా మొదటి స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులకు, ఆమెకు మధ్య గ్రూపు తగాదాలున్నాయి. అసమ్మతి గ్రూపు ఇప్పుడు నాన్‌లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇది ఇంతటితోనే ఆగుతుందా లేక పార్లమెంటు సభ్యుల వరకు పాకుతుందా అన్న చర్చ రాజకీయాల్లో సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనున్న అనంతపురం, హిందూపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ ఇద్దరూ కర్నూలు జిల్లాకు చెందిన వారు. వీరి విషయంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వస్తూనే ఉంది. అయితే పై ఇద్దరూ జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేయడంతో ఇక్కడి వారేనన్నట్టుగా ఉన్నప్పటకీ రాజకీయాల్లో మాత్రం ప్రతి అంశం వివాదాస్పదం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
లోకల్, నాన్‌లోకల్ అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ చర్చకు వస్తుండటం గమనార్హం. ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ అంశంపై వివాదం నడుస్తోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జీగానున్న ఉమామహేశ్వరనాయుడు బెళుగుప్ప మండల వాసిగానున్నారు. ఈ మండలం ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. ఆయన కళ్యాణదుర్గంలోనే ఉంటున్నారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి ఆయనకు మధ్య సఖ్యత లేదు. తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు వచ్చేసరికి ఇటువంటి అంశాలు మరిన్ని ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ సొంత పార్టీ నాయకుల నుంచే స్థానికత అంశం ముదురుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.










