Apr 09,2023 21:53

టిడిపి

         అనంతపురం ప్రతినిధి : 'వైసిపి అధికారంలోకి వచ్చాక దళితులు, మహిళలపై దాడులు పెరిగాయని యువగళం పాదయాత్రలో లోకేష్‌ ప్రతి ప్రసంగంలోనూ ప్రస్తావిస్తున్నారు. తాము ఆ వర్గాలకు అండగా నిలుస్తామని చెబుతున్నారు. అయితే ఆచరణలో చూస్తే అది కనిపించడం లేదు. తన సొంత పార్టీలో ఒక నియోజకవర్గం ఎస్సీ, మహిళను ఇద్దరు నేతలు బాహాటంగానే అవమానిస్తూ వస్తున్నా లోకేష్‌ చూసిచూడనట్టు ఉండటం అనేక విమర్శలకు తావిస్తోంది. ఆ ఇద్దరు నేతలను కనీసం హెచ్చరించే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు మాట్లాడే అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. కానీ ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన శింగనమలకు వచ్చే సరికి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానున్న బండారు శ్రావణికి ఆ అవకాశం కల్పించకపోవడం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
లోకేష్‌ యువగళం పాదయాత్ర శుక్రవారం రోజు శింగనమల నియోజకర్గంలోకి ప్రవేశించింది. అదే రోజు యాత్ర ముగిసిన తరువాత బండారు శ్రావణి, ఆయన తండ్రి రవికుమార్‌లు లోకేష్‌ను కలిసేందుకు విడిది వద్దకు వెళ్లిన సమయంలో టూమెన్‌ కమిటీ సభ్యులకు సంబంధించిన ఒక వ్యక్తి వారిని కామెంట్‌ చేసినట్టు సమాచారం. దీనిపై బండారు శ్రావణి ప్రతిస్పందించడంతో ఏకంగా బూతుపురణాన్ని సదరు నాయకుడి సోదరుడు అందుకోవడమే కాకుండా శ్రావణి తండ్రి రవికుమార్‌పై దాడికి సైతం యత్నించినట్టు సమాచారం. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటి రోజు నుంచి సాగుతున్న యాత్రలోనూ బండారు శ్రావణికి అడ్డంకులు తప్పడం లేదన్న చర్చ టిడిపి వర్గాల్లోనే సాగుతోంది. లోకేష్‌తోపాటు నడుస్తున్న సమయంలో శ్రావణిని పక్కకు నెట్టేస్తున్న దృశ్యాలు వీడియోలో రావడం దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శింగనమల ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలోనే ఇన్‌ఛార్జి ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులతో టూమెన్‌ కమిటీ వేయడం, వారి ద్వారానే నియోజకవర్గ కార్యక్రమాలు నిర్వహించే విధంగా అధి నాయకత్వం చూడటం పట్ల ముందునుంచి ఆ తరగతుల్లో అంసతృప్తి ఉంది. ఇక పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, అనంతపురం, ఉరవకొండ అన్ని నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను సభల్లో లోకేష్‌ మాట్లాడించారు. పెనుకొండలో అయితే ఇన్‌ఛార్జి బికెతోపాటు సబితకూ అవకాశమిచ్చారు. శింగనమల నియోజకవర్గంలో వచ్చే సరికి గార్లెదిన్నె సభలో ఇన్‌ఛార్జి స్థానంలో అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు ప్రసంగించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న బండారు శ్రావణికి అవకాశం కల్పించకపోవడం చర్చనీయాంశం మారింది. ఒకవైపు దళితులు, మహిళలకు అవకాశం ఇస్తూ తాము అండగా ఉంటామని ప్రకటనలు చేస్తూ, ఆచరణలో ఏమి చేస్తున్నారన్న ప్రశ్నలు దళిత సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలపై ఇప్పటికే పిసిసి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ సాకే శైలజనాథ్‌ సైతం ఖండించారు. ఇతర దళిత సంఘాలు కూడా టిడిపిలో జరుగుతున్న తీరును తప్పుబడుతున్నారు. మరి దీనిపై లోకేష్‌, టిడిపి అధినాయకత్వం ఎలా స్పందిస్తోందో చూడాల్సి ఉంది.