Apr 12,2023 22:00

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి

ప్రజాశక్తి-తాడిపత్రి      యువగలం పాదయాత్రలో లోకేష్‌ బాబుతో ఏ విధమైన ఆరోపణలు చేయించినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. నారా లోకేష్‌ నిర్వహిస్తున్న యువగలం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో రెండవ రోజూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాడు స్వాతంత్య్ర కోసం జైలు కెళ్తే.. నేడు ప్రభుత్వ వేధింపులతో జైలుకు వెళ్తున్నారని కరపత్రాలు పంపిణీ చేయడం తాడిపత్రి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక వైసిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పందించారు. ప్రభాకర్‌రెడ్డి మూర్ఖుడని.. కేసులన్నీ టిడిపి ప్రభుత్వంలో బనయించబడినవే అన్నారు. ఆరోజున 800 మంది జనంతో ఆశ్రమం మీద దండయాత్రగా వెళ్తే తూతూమంత్రంగా కేసు నమోదు చేశారన్నారు. బాధితులు రిజిస్టర్‌ పోస్టు ద్వారా కేసులు నమోదు చేసుకున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అప్పటి సీసీ ఫుటేజీలు, విజువల్స్‌ను బట్టి వ్యక్తులను గుర్తిస్తూ కేసులు నమోదు చేశారన్నారు. ఆరోజు టిడిపి ఎంపీగా దివాకర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తాళాలు వేసిన ఘనతను స్థానిక ప్రజలు మరువలేదన్నారు. బిఎస్‌-3, బిఎస్‌-4 వాహనాల నకిలీ ఇన్సూరెన్స్‌లు, ఫోర్జరీ సంతకాల కేసులు అక్రమ కేసులు అంటూ జెసి.బ్రదర్స్‌ లోకేష్‌ వద్ద అమాయకత్వాన్ని ఒలకబోస్తున్నారని అన్నారు. వారిపై ఉన్న అవినీతి, ఆరోపణలను లిఖిస్తే రామాయణం, భారతం కంటే ఎక్కువ పేజీలు అవుతాయన్నారు. ఇసుక గవర్నమెంట్‌ పాలసీ అన్నారు. దీనిపై ఆరోపణలు అవాస్తవం అన్నారు. దీనిపై లోకేష్‌ కమిటీ వేసి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తాడిపత్రి ప్రాంతంలో గతంలో 700 నల్ల బండల యూనిట్లు, 300 గ్రానైట్‌ యూనిట్లు కొనసాగుతుండేవని తెలిపారు. ఆ రోజుల్లో ప్రయివేటు చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలను నిర్వీరం చేశారన్నారు. అనేకమంది ఉపాదినిó దెబ్బతీశారన్నారు. జేసీ బ్రదర్స్‌ మాటలు విని లోకేష్‌ ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.