Oct 29,2022 21:23

లంపీ వైరస్‌ టెన్షన్‌
దోమలు, ఈగల వల్లే వ్యాధి
ఇతర రాష్ట్రాల నుంచి వ్యాప్తి చెందకుండా కట్టడి
చిత్తూరు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ
వేగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడంతో పశువులలో చర్మవ్యాధులు రావడం ఫలితంగా పశువులు అనారోగ్యానికి గురికావడంతో పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతోంది. పశువుల శరీరంపై బొబ్బలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధిని లుంపి చర్మవ్యాధిగా గుర్తించడం జరిగింది. ఈ వ్యాధిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను ప్రారంభించింది. భారత వెటర్నరీ ఇన్స్టిట్యూట్‌ వారు ప్రత్యేకమైన రీసెర్చ్‌ ఒక వైపు కొనసాగుతుండగా మరోవైపు ఈ వ్యాధి లక్షణాలలో గొట్‌ఫాక్స్‌ ఉండడంతో గోట్‌ ఫాక్స్వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించడం ద్వారా వ్యాధిని రాకుండా కాపాడవచ్చునని భావించి ఈకార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తున్నారు.
ఈ వ్యాధి స్వభావం..
లంపీ చర్మవ్యాధి వచ్చిన పశువుల చర్మంపై పొక్కులు, లేదా బొబ్బలు రావడం జరుగుతుంది. 105 డిగ్రీలకు పైగా జ్వరం నమోదు అవుతుంది. పశువులలో కళ్ళల్లో నుంచి నిరంతరం నీరు కారడం క్రమేణా పెరుగుతుది. కొన్ని అవయవాలతోపాటు జ్ఞానేేంద్రియాలు వాపు ఉంటాయి. పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తర్వాత దశలో కాళ్లనొప్పుల కారణంగా పశువు సరిగ్గా నడవలేక ఇబ్బందులు పడుతుంది. ఈ స్వభావాలు పశువులకు దోమలు, ఈగలు వంటి కీటకాలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిసోకిన జంతువుతో మరొక జంతువు సన్నిహితంగా ఉంటే వ్యాధి వ్యాపిస్తుంది. ఈవ్యాధి పశువులను ప్రభావితం చేసే వైరల్‌ వ్యాధి. ఎల్‌ఎస్‌డి లంపీ స్కిన్‌ డిసీజ్‌ వైరస్‌ వల్ల వస్తుంది. ఇది ఫోక్స్‌వీర్‌ కుటుంబానికి చెందిన వ్యాధి క్యాప్రీ ఫాక్స్‌ జాతికి చెందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
ఈ వ్యాధిని భారత దేశంలో 2019లో గుర్తించడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌తో సహా ఒరిస్సాలో ఈ వ్యాధి వ్యాపించింది. అప్పటినుంచి పలురాష్ట్రాలలో దీన్ని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటివరకు పది రాష్ట్రాలలో గుజరాత్‌తో సహా వ్యాపించింది. చిత్తూరు జిల్లాలో కూడా ఈవ్యాధి ప్రభావం కొంతమేరకు ఉండడంతో ముందుగానే గుర్తించిన జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి సమాచారం అందించి దీనిని అరికట్టే చర్యలను ప్రారంచారు. అప్పటికే పలు ప్రాంతాలలో వ్యాపిస్తుండడంతో చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలలో ఉన్న పశువులకు మొదట ఒకటి పాయింట్‌ ఆరు లక్షలు వ్యాక్సినేషన్‌ చేయడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వ్యాధి ఉన్న పశువులు జిల్లాలోకి రాకుండా పోలీసులు మార్కెటింగ్‌ శాఖ, రవాణా శాఖ సహకారంతో చెక్‌పోస్టుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి పశువుల రవాణాను ఆపివేశారు.
అలాగే పశువుల సంతలను జరగకుండా ఆపడం జరిగింది. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చునని భావించడంతో వాటిని నిలిపివేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా కొనుగోలు జరిగే పశువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు ఆపివేశారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో సరిహద్దులో ఉన్న నిండ్ర, నగిరి, కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, పాలసముద్రం, గంగాధర నెల్లూరు, యాదమర్రి, బంగారుపాళ్యం, పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట, శాంతిపురం, రామకుప్పం, గుడిపల్లి, కుప్పం, గంగవరం, పెద్దపంజాణి, పుంగనూరు మండలాలలో ఈ వ్యాధి ఉంటుందని భావించి ఇప్పటికే సంతలు రవాణాను పూర్తిగా ఆపివేశారు.
ఈ మండలాల్లో మొత్తం 1.6లక్షల పశువులు ఉన్నాయని గుర్తించి వాటికి వ్యాక్సినేషన్‌ ఇప్పటికే పూర్తిచేయడం జరిగింది. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్‌ నివేదిక పంపడంతో జిల్లాలో మొత్తం 4.6లక్షల పశువులకు వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని భావించారు. మొదట ప్రభుత్వం 1.6లక్షలు ఇవ్వగా, ప్రభుత్వం తిరిగి మూడు లక్షల వ్యాక్సిన్‌ లను పంపడం జరిగింది. ఇటీవలే అన్ని కేంద్రాలకు ఈవ్యాక్సిన్‌ చేరుకొంటోంది. ఒక ప్రణాళికబద్ధంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసి ఉండడంతో పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గోట్‌ఫాక్స్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చునని భారత వెటర్నరీ ఇన్స్టిట్యూట్‌ వారు వెల్లడించడంతో ఈకార్యక్రమం మొదలైంది. అయితే ఈ వ్యాధి జంతువుల నుంచి మానవులకు వ్యాపించదని, జూనోటిక్‌ కాదని పలు అధ్యయన సంస్థలు వెల్లడించాయి.
జిల్లాలో మొత్తం పశువులు 5.4లక్షలు ఉండగా అందులో 4.80 లక్షల పశువులకు గోట్‌ఫాక్స్‌ వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో ఇచ్చిన వ్యాక్సిన్‌ కాకుండా తిరిగి 3లక్షల పశువులకు సరిపోయేలా వ్యాక్సిన్‌ పంపడం జరిగింది. ఇప్పటివరకు 1.6లక్షల పశువులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవిషయంపై తీవ్రంగా స్పందించడంతోపాటు అంతర్రాష్ట సరిహద్దులలో గల చెక్‌పోస్టుల వద్ద నిఘాను మార్కెటింగ్‌, రవాణా, పోలీస్‌శాఖల సహకారంతో పెంచడం, పశువులకు సంబంధించిన వారపు సంతలను ఆపివేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతన్నామని అంటున్నారు. ఏదైనా ఇబ్బందికర సమాచారం 106కు అందిస్తే వెంటనే తగు సహాయం అందించడం జరుగుతోందనీ అలాగే వ్యాధి వచ్చిన ఆవులను ఆస్పత్రికి తీసుకొని రావడం ద్వారా చికత్స అందిస్తున్నారు. కొన్ని గ్రామాలలో పశు వైద్య సిబ్బంది పశువులు ఉన్నచోటే చికిత్స అందించడం జరుగుతోంది.
లంపీ వ్యాధి నిరోధానికి 1.6లక్షల వ్యాక్సిన్‌
- వెంకటరావు, పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరక్టర్‌
జిల్లాలోని 31 మండలాలలో ఈ వ్యాక్సిన్‌ 4.8లక్షల పశువులకు వేయాలని భావించడం జరిగింది. వారం రోజులలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. క్షేత్రస్థాయిలో గ్రామాలలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్‌ ఉచితంగా వేయడం జరుగుతుంది. ప్రభుత్వపరంగా అన్నిచర్యలు తీసుకుంటున్నారని వైద్యసిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలాగా ఆదుకుంటుందని పశువుల యజమానులు అంటున్నారు.
చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాం
- ఎం.హరినారాయణన్‌, జిల్లా కలెక్టర్‌
గత రెండు నెలల క్రితం చిత్తూరు జిల్లాలో లుంపి చర్మవ్యాధి వస్తోందని ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల నుంచి పశువులు రావడం జరుగుతుందని భావించి చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచడం జరిగింది. ఈ సమాచారం రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సరిహద్దు గ్రామాలలో పూర్తి చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో వ్యాక్సినేషన్‌ చేయాలని భావించి ప్రభుత్వానికి తెలియజేయడంతో మరోసారి వ్యాక్సిన్‌ పంపడం జరిగింది. వ్యాధిసోకిన పశువులకు చికిత్సలు అందించడం జరుగుతోంది. వ్యాక్సినేషన్‌ సకాలంలో పూర్తి చేసి వ్యాధి రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.