Sep 14,2023 23:16

మాట్లాడుతున్న గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌

* గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి
* గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌, జలుమూరు: 
గృహ నిర్మాణాల లక్ష్యసాధనలో వెనుకబడిన ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌ హెచ్చరించారు. నగరంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌తో కలిసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 30 లక్షల గృహ నిర్మాణ పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ మంజూరు చేశామని, ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ చరిత్రలో ఒకేసారి రూ.15 వేల కోట్లతో ఇళ్లు నిర్మించడం ఇదే ప్రథమమన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిలో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాకు మంజూరైన 75,840 గృహాల్లో 25 వేలు పూర్తయ్యాయని తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.ఐదు వేల కోట్లు వ్యయం చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో గృహనిర్మాణ శాఖ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో గహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్‌.గణపతి, డ్వామా పీడీ చిట్టిరాజు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, జిల్లా అధికారులు ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ నాగేశ్వరరావు, అర్బన్‌ సహాయ ఇంజినీర్‌ గణేష్‌ ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జలుమూరు మండలం చల్లవానిపేటలో జగనన్న కాలనీని పరిశీలించారు. కాలనీ ముఖద్వారాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి వాన గోపి, మండల సలహాదారుడు పైడి విఠల్‌రావు, మండల వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు బి.లక్ష్మణరావు, హౌసింగ్‌ సిబ్బంది ఉన్నారు.