ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు జగనన్న హౌసింగ్ కాలనీల్లో పక్కాగహాల నిర్మాణాలు చేపట్టాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం కమిషనర్ నగరపాలక సంస్థ పరిధిలో దొడ్డిపల్లి లేఅవుట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే హౌసింగ్ అధికారులు, అమినిటీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా పంపిణీ చేసిన ఇంటి స్థలాలు, ప్రారంభించిన ఇల్లు, వాటి పురోగతి, బిల్లుల చెల్లింపు స్థితిగతులపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ఎక్కడ నిర్లక్ష్యానికి తావులేకుండా... రోజూ, వారంతా లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారులతో రోజూ మాట్లాడుతూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టేలా హౌసింగ్ అధికారులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈ శ్రీధర్, అమినిటీ కార్యదర్శులు పాల్గొన్నారు.










