Jul 04,2023 22:29

జెడిఎ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న రైతుసంఘం నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : '2022లో పంటలు సాగు చేసి అతివృష్టి, అనావృష్టి కారణంగా ఒక్కో రైతు లక్షలాది రూపాయలను పెట్టుబడులు రూపంలో నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. అలా కాకుండా లక్షల్లో పంటలు నష్టపోతే వందల్లో పంట నష్టపరిహారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసింది. ఇలాంటి కంటితుడుపు చర్యలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు'. అంటూ రైతు సంఘం సంఘం నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లాలోని రైతులకు ప్రభుత్వం ప్రకటించిన 2022 ఖరీఫ్‌ పంటల బీమా అందరికీ ఆయా పంటల నష్టాన్ని బట్టి పూర్తి స్థాయిలో ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ జెడి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుకుగా పెన్నార్‌ భవనం నుంచి రైతులు, రైతుసంఘం నాయకులు ర్యాలీగా జెడిఏ కార్యాలయానికి చేరుకుని, అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్‌.చంద్రశేఖర్‌ రెడ్డిలు ్డ మాట్లాడుతూ జిల్లాలో అతివష్టి, అనావష్టి వల్ల రైతులు సాగుచేసిన అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దాదాపు రూ.3వేల కోట్లను పెట్టుబడుల రూపంలో రైతులు కోల్పాయారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2022 ఖరీఫ్‌ పంటల బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వేరుశనగ పంటకు ఎకరాకు రూ.700 నుంచి రూ.1500 లోపు ఇవ్వడం అంటే రైతులను మోసం చేయడమే అన్నారు. కంది, పత్తి తదితర ఇతర పంటలకు కూడా నామమాత్రంగానే బీమా ఇచ్చారన్నారు. పండ్ల తోటలకు సంబంధించి దానిమ్మ, పత్తి, అరటి, మిరప, టమోటా తదితర పంటలకు బీమా ఇవ్వలేదన్నారు. రైతులు లక్షల్లో పంటలను నష్టపోతే ప్రభుత్వం వందల్లో పరిహారం ఇవ్వడం అన్యాయం అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు 242 మంది ఆత్మహత్యలు చేసుకుని మరణించారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలను చేపట్టకుండా ఇలాంటి కంటితుడుపు బీమాలను విడుదల చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి ఖరీఫ్‌ బీమాను సవరించి రైతులకు ఆయా పంటల సాగునుబట్టి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 8వ తేదీన ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నారని, ఆ లోపుగా పంట నష్టపరిహారాన్ని సవరించి వేరుశనగ, పత్తికి ఎకరాకు రూ.30 వేలు, కందికి రూ.20 వేలు, దానిమ్మ, మిరప, అరటి పండ్లతోటలకు ఎకరాకు రూ.50 వేలు బీమా ప్రకటించి అమలు చేయాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పండ్లతోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి, కౌలు రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాల రంగయ్య, రైతుసంఘం నాయకులు బి.చంద్రశేఖర్‌ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఎపి రైతుసంఘం రాష్ట్ర నాయకులు రాజారామిరెడ్డి, చెన్నారెడ్డి, జిల్లా నాయకులు పోతలయ్య, శ్రీనివాసులు, రాముడు, చంద్రశేఖర్‌, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.