Nov 07,2022 21:53

పిసిపిఎన్‌డిటి సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో రేణుక

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
అరికట్టేందుకు అవగాహన కల్పించండి : ఆర్డీవో రేణుక
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఎట్టి పరిస్థితులలోనూ గర్భస్థ పిండ లింగనిర్ధారణ, గర్భస్రావం చేయడం చట్టరీత్యా నేరమని చిత్తూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి రేణుక అన్నారు. అంతేకాకుండా అటువంటి గర్భస్రావం చేయించుకునే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని దీని గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అటువంటి చర్యలు చేపట్టే వారి మీద కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సోమవారం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో పిసిపిఎన్‌డిటి కార్యక్రమంపై డివిజనల్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు, డెమో అధికారులు జయరాముడు కష్ణారెడ్డి ఎన్జీవోలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఇంకా కొంతమంది లింగ నిర్ధారణ, గర్భస్రావం కోసంపలువురు ఆర్‌ఎంపీలను ఆశ్రయించి చేయించుకుంటున్నారని ఫలితంగా అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాల మీదికి కోరితెచ్చుకుంటున్నారన్నారు. ఈ పరిస్థితి నుంచి వారిని బయటకు తీసుకు రావాలంటే మొదట క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది రావడం జరుగుతొందని వారీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. డాక్టర్‌ రవిరాజు మాట్లాడుతూ జిల్లాలో 22 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయని అవసరమైనప్పుడు మినహా మిగతా పరిస్థితులలో స్కానింగ్‌ చేసుకోవడానికి అనుమతించకూడదని ఇటువంటి స్కానింగ్‌ చేయించుకోవాలంటే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరిగా ఉండాలని, ఎటువంటి పరిస్థితి లోను శిశువు అభివద్ధి చెప్పాలి కానీ లింగ నిర్ధారణ చేయకూడదని, అబార్షన్‌ చేసుకోవాలని ఎవరైనా వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అన్నారు. డెమో అధికారి జయరాముడు మాట్లాడుతూ జిల్లాలోకి వివిధ రాష్ట్రాల నుంచి మాత్రలు రావడం జరుగుతుందని కమిటీ నిర్ణయంతో డ్రగ్‌ ఇన్స్పెక్టర్‌లు అటువంటి మాత్రలు అమ్మే దుకాణాలపై నిఘా ఉంచాలని కోరడం జరుగుతుందన్నారు. రానున్న రోజులలో ఈ స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీలు చేయాలని అదేవిధంగా కళాశాలలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పోలీసుల సహకారంతో అవగాహన కల్పించాలన్నారు.