Apr 10,2023 23:02

లీజుకు సంబంధించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- బుక్కరాయసముద్రం       బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సర్వే నెంబరు 396-7లో గ్రావెల్‌ తవ్వి అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న మట్టి వ్యాపారులు, భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం సిపిఎం బృంద సభ్యులు బుక్కరాయసముద్రం మండలంలోని గ్రావెల్‌ తవ్వి మట్టి అమ్ముకుంటున్న లీజుకు సంబంధించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నగరానికి కూతవేటు దూరంలో భూకబ్జాలు భూ అక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఈ ప్రాంతాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. లీజు పేరుతో మట్టి మాఫియా పెరిగిందన్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత లీజుకు కేటాయించిన భూమిలో కాకుండా రైతుల భూముల్లోనూ రోడ్ల వైపున అనుమతులులేని ఇతర భూముల్లో మట్టిని తవ్వుకుంటూ అమ్ముకుంటున్నారని తెలిపారు. ట్రాక్టర్‌కు రూ.350 చొప్పున వసూలు చేసుకుని వందల ట్రాక్టర్లతో మట్టిని తవ్వుకొని అమ్ముకున్నారని తెలిపారు. అత్త సొమ్ము..అల్లుడు పెత్తనం అన్న చందాన భూ వ్యాపారుల వైఖరి ఉందన్నారు. సమీపంలో ఉన్న రైతుల భూముల్లో కూరపాటి సుధాకర్‌ తండ్రి నారాయణ శెట్టి, సురేష్‌ రాజా సన్నాఫ్‌ నారాయణ శెట్టి భూముల్లోని మట్టిని తవ్వుకుని అమ్ముకున్నారని బాధితులు సిపిఎం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అనుమతి లేని రైతుల భూముల్లో మట్టిని అమ్ముకున్న లీజ్‌దారులపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. భూకబ్జాలు, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని మాటలు చెప్పడం తప్ప ఆచరణలో చేసింది శూన్యం అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే భూకబ్జాలు, అక్రమాలు, మట్టి వ్యాపారం పేరుతో రైతుల భూమిని మట్టిని తరలించడాన్ని ఎందుకని నివారించలేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. మౌనంగా ఉండటం కూడా ప్రజలకు నష్టమే అన్నారు. అక్రమాలపై విచారణ చేపట్టాలన్నారు. బాధ్యులపై, లీజుదారునిపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కాని అలా జరగలేదన్నారు. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అన్యాయం అన్నారు. దేవుడి గుడికి దారి లేకుండా చేసి బండలపై ప్రతాపం చూపటం ఏమిటని ప్రశ్నించారు. ఈ నక్కలతిప్పకు సంబంధించిన మట్టి కోసం కొండలో ఉన్న నాగమల్లేశ్వర దేవాలయానికి సంబంధించిన రస్తాను చెరిపేసి, బండలను పగలగొట్టిన దేవుణ్ణి సైతం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మైనింగ్‌, రెవెన్యూ అధికారులు అక్రమంగా మట్టిని తరలించిన లీజూదారునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విచారణ చేపట్టాలని, కేసులో నమోదు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తోందన్నారు. భూ కబ్జా, అక్రమ మట్టి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోని బాధితులతో కలుస్తామన్నారు. అప్పటికీ కదలకపోతే ఇక్కడే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, జిల్లా నాయకులు కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.