Mar 11,2023 20:54

ప్రజాశక్తి - భీమవరం
నరసాపురం అలంకృతి లేసు పార్కు ఉత్పత్తుల మార్కెటింగ్‌ విస్తరణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ లేసు పారుపై సంబంధిత అధికారులతో సమీక్షించి మాట్లాడారు. లేసు ఉత్పత్తులు ప్రజాదరణ పొందేలా నూతన డిజైన్లు రూపొందించడంతోపాటు, మార్కెటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 35 కామన్‌ ప్రొడక్షన్‌ సెంటర్స్‌, 15 కామన్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వీటికి భారత ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన యూసీ లను వెంటనే సంబంధిత శాఖకు అందజేయాలన్నారు. డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ టెక్స్టైల్స్‌ మంత్రిత్వ శాఖ ద్వారా ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, భారత ప్రభుత్వ టెక్స్టైల్స్‌ శాఖ విజయవాడ హ్యాండీక్రాఫ్ట్స్‌ సర్వీస్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.అపర్ణ లక్ష్మి, జిల్లా హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్టైల్స్‌ అధికారి కె.అప్పారావు, జిల్లా కోపరేటివ్‌ అధికారి ఎం.రవికుమార్‌, పరిశ్రమ శాఖ ఐపిఒ, డిఆర్‌డిఎ సిబ్బంది పాల్గొన్నారు.