Aug 25,2022 22:34

లేబర్‌ కోడ్స్‌, రూల్స్‌ను
రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య
ప్రజాశక్తి- పలమనేరు

కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసే లేబర్‌ కోడ్స్‌, రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి పి.చైతన్య డిమాండ్‌ చేశారు. గురువారం పలమనేరులోని రెవెన్యూ డివిజన్‌ అధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ధర్నాచేసి అనంతరం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ కోడ్స్‌, రూల్స్‌ను 25,26 తేదీల్లో జరుగుతున్న జాతీయ కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకుండా తిరస్కరించి కార్మికుల పక్షాన నిలబడాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కంపెనీల యాజమాన్యాలకు లబ్ది చేకూర్చడానికి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం సవరించి నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చడాన్ని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ ఆ కోడ్స్‌, రూల్స్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరింప చేయడానికి రెండురోజుల పాటు తిరుపతిలో జాతీయ స్థాయిలో కార్మికశాఖ మంత్రుల సమావేశం జరపడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో కార్మిక నాయకులకు రెండు రోజులుగా పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజ్యాంగం కల్పించాన ఆర్టికల్‌ 19ని కాలరాయడమే అని విమర్శించారు. తిరుపతి సమావేశం సందర్భంగా పోలీసులు జిల్లాలోని సీఐటీయూ నాయకులు తిరుపతికి వెళ్లకూడదని అడ్డుకోవడం, వెళ్లితే కేసులు పెడతామని హెచ్చరించడం, నోటీసులు ఇవ్వడం, గృహనిర్భందాలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్తా, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు శంకర్‌, జయచంద్రా, నాయకులు సావిత్రి, వరలక్ష్మీ, ఈశ్వర్‌, రాజా, జయంతి పాల్గొన్నారు.