Aug 22,2022 22:25

ధర్నా చేస్తున్న సిఐటియు, ఏఐసిసిటియూ, కార్మిక సంఘాలు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి 44చట్టాలను బిజెపి నాలుగు లేబర్‌ కోడ్స్‌గా రూపొందించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు, ఏఐసిసిటియూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమలు చేసేందుకు ఈనెల 25,26 తేదీల్లో తిరుపతిలో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహణను వ్యతిరేకిస్తూ ధర్నా చేసి వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య మాట్లాడుతూ లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయని అన్నారు. మన రాష్ట్రప్రభుత్వం ఈనెల 25,26 తేదీల్లో తిరుపతిలో జరిగే కార్మికశాఖ మంత్రుల సమావేశం ఆమోదించకూడదని డిమాండ్‌ చేశారు. బ్రిటిష్‌ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను తొలగిస్తూ లేబర్‌కోడ్స్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రూపొందించి కార్మికులకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. ఏఐసిసిటియూ నాయకులు గంగాధర గణపతి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు చల్లా వెంకటయ్య, భువనేశ్వరి, గిరిధర్‌ గుప్తా, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జ్యోతి, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఆరోగ్య దాస్‌, శంకర్‌, అంగన్వాడీ నాయకులు శ్యామల, అనిత, గ్రావిటి ఇండియా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షకార్యదర్శులు సురేష్‌, దినేష్‌, నవీన్‌, గ్రామ పంచాయీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ గోవిందప్ప, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కాంజీవరం సురేంద్రన్‌, కార్మికులు పాల్గొన్నారు.