Apr 22,2023 21:22

మజ్జిగ పంపిణీలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, సిపిఎం నాయకులు

           ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   భిన్నత్వంలో ఏకత్వంగా సర్వమతాల వారు అన్నదమ్ములుగా మెలుగుతున్న దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ పిలుపునిచ్చారు. రంజాన్‌ పండుగ సందర్భంగా హెచ్‌ఎల్‌సి కెనాల్‌ దగ్గర ఉన్న మసీదు, ఇందిరానగర్‌లోని మసీద్‌ల్లో ప్రార్థనలకు హాజరైన ముస్లిములకు సిపిఎం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ముందుగా రాంభూపాల్‌తోపాటు నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి ముస్లిములను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, దేశానికి శుభం కలగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులను చూస్తుంటే మనల్ని పరిపాలిస్తున్న పాలకుల విధానం చాలా భయంకరంగా ఉందన్నారు. ఒక వర్గాన్ని భయపెట్టే విధంగా పరిపాలన సాగుతుందన్నారు. కావున ఈ విధానానికి వ్యతిరేకంగా హిందూ- ముస్లింలు ఐక్యంగా కలిసి పోరాడాల్సి ఉందన్నారు. ముస్లిం పెద్దలు విచ్చేసి సిపిఎం చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఇందిరా నగర్‌ శాఖ కార్యదర్శి ప్రసాద్‌, అంజి, రాము, చిరంజీవి, సాగర్‌, మోహన్‌, వెంకటేశు, సిపిఎం నగర నాయకులు ప్రకాష్‌, వెంకటేష్‌, వలీ, మసూద్‌, బాబు, జీవ, గపూర్‌, వెంకటనారాయణ, నరసింహారెడ్డి, ఫకృ, రామాంజి, ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.