ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాలశాఖ అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. ఖరీఫ్‌లో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామంటూ నాలుగు రోజుల క్రితం వరకూ అధికారులు ఊదరగొట్టారు. ఖరీఫ్‌లో లారీల సమస్యతో రైతులు ఏవిధంగా బాధపడ్డారో మళ్లీ అదే సమస్య రబీలోనూ రైతులను వెంటాడుతున్న పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లోనూ మూడు లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దాదాపు 70 శాతం వరకూ మాసూళ్లు పూర్తయినట్లు రైతులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, నిడమర్రు వంటి అనేక మండలాల్లో పెద్దఎత్తున రైతులు మాసూళ్లు చేసి ధాన్యం రాశులు చేసి ఉంచారు. ఆలస్యంగా గడిచిన ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. అనేక తర్జనభర్జనల తర్వాత ఎకరాకు 92 సంచులు ఇస్తున్నారు. రైతులు సంచులు తీసుకుని ధాన్యం పట్టి సిద్ధంగా ఉంచారు. ధాన్యం సంచుల్లో పట్టి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించేందుకు లారీలు మాత్రం రావడం లేదు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఖరీఫ్‌లో ఎదురైన సమస్యలపై పౌరసరఫరాల శాఖాధికారులు ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. పౌరసరఫరాల శాఖాధికారులు సరైన ప్రణాళికలు సిద్ధం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. బస్తాల్లో ధాన్యం ఏవిధంగా తరలించాలో తెలీక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కిరాయి సొమ్ము చెల్లిస్తే లారీలు పెడతామని లారీల యజమానులు చెబుతున్న పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. మిల్లుల దూరాన్ని బట్టి లారీ కిరాయి రూ.తొమ్మిది వేల నుంచి రూ.12 వేలకుపైగా అడుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. అంత పెద్దమొత్తంలో కిరాయిలు చెల్లించలేక, అధికారులు లారీలు పంపించకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో కడుపుమండిన రైతులు శుక్రవారం పూళ్ల జాతీయ రహదారిపై ఆందోళనకు దిగి లారీలో పంపించండి మహాప్రభో అంటూ వేడుకున్న పరిస్థితి నెలకొంది. తమ బాధలను అధికారులు దృష్టికి తీసుకెళ్లాలంటూ మీడియాకు లేఖ రూపంలో రైతులు తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఉంగుటూరుతోపాటు చుట్టుపక్కల మండలాలకు కేవలం 70 లారీలు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇవి ఏవిధంగా సరిపోతాయో తెలియక స్థానిక అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పలు గ్రామాల్లో 90 శాతం మాసూళ్లు పూర్తయిన పరిస్థితి నెలకొంది. అలాంటి గ్రామాలకు కూడా శుక్రవారం ఒక్కలారీ మాత్రమే వెళ్లిన పరిస్థితి కొనసాగింది. లారీల కోసం రైతులు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ధాన్యం రవాణాలో ఏర్పడిన లారీల సమస్యను పరిష్కరించాలని రైతులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు.










