Dec 02,2022 22:37

వ్యవసాయ అనుబంధశాఖల అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి

లాభాల పంటలే పండిద్దాం..!
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగాన్ని లాభాల దిశగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో రైతులకు సహకరించడానికి ఉద్యోగస్తులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం వి ఎస్‌ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో గల మీటింగ్‌ హాల్లో సమీక్ష నిర్వహించారు. లాభాలొచ్చే పంటల్నే రైతులు పండించేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ రంగం అభివద్ధి కోసం రైతు భరోసా కేంద్రాలను అభివద్ధి చేసి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు పంపిణీ చేసి విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అన్ని విధాలుగా సహకరించేందుకు పనిచేస్తున్నాయని అన్నారు. సాగు చేసిన ప్రతి ఎకరాకూ గిట్టుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, రైతు నష్టపోకుండా కనీస మద్దతు ధర ఇచ్చేలా చూస్తున్నారని అన్నారు. క్రమం తప్పకుండా వ్యవసాయ మండల సమావేశం నిర్వహిస్తూ జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తూ పరిష్కరిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తూ నూతన శాస్త్రీయ విధానాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వ్యవసాయ పరికరాలను మరో రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవసాయం పట్ల అత్యధిక శ్రద్ధ చూపుతోందన్నారు.
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోపాడి పరిశ్రమ మీద ఎక్కువమంది ఆధారపడి జీవిస్తున్నారని, దేశీయ ఆవులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారన్నారు. మొదట ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ స్థితిగతులను గురించి జిల్లా వ్యవసాయ అధికారి రత్న ప్రసాద్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌, శాస్త్రవేత్త చంద్రశేఖర రెడ్డి, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి వెంకటరావు, పట్టు పరిశ్రమ శాఖ అధికారిని శోభారాణి, ఉద్యాన వనశాఖ అధికారి మధుసూదన్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో సేంద్రీయ వ్యవసాయం పరిశీలన
మధ్యాహ్నం వైస్‌ చైర్మన్‌ తవణంపల్లి మండలంలోని ఎగువ తవణంపల్లిలో వినోద్‌ రెడ్డి కంపెనీలో పని చేస్తూ ఆ వత్తిని వదులుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తూ శాస్త్రీయ పద్ధతిలో నూనెలను తయారుచేసి, గోమూత్రం పేడ నుంచి వివిధ వస్తువులను తయారు చేసి ఆన్లైన్‌ ద్వారా వ్యాపారం చేస్తున్న తీరును పరిశీలించారు. ఏ విధంగా పేడ నుంచి పిడకలను వివిధ ఆకతులలో తయారుచేసి అమ్మడం జరుగుతుందని వివరించారు. గతంలో ఫార్మా కంపెనీలో పనిచేస్తూ 10 సంవత్సరాల క్రితం ఆ వత్తిని వదులుకొని గ్రామంలో స్థిరపడి ఈ వ్యాపారం చేసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటున్నానని వివరించారు. అనంతరం వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ కామాలూరు గ్రామంలో పూర్ణచంద్రారెడ్డి అనే రైతు దేశీయ పశుసంపదను ప్రోత్సహిస్తున్న విధానం పరిశీలించారు. షాహివాల్‌, గిర్‌, ఒంగోలు జాతి, పుంగనూరు జాతి పశు సంపదను ప్రోత్సహిస్తూ పేడ మూత్రం నుంచి ఘన జీవామతం, ద్రవ జీవామతం తయారుచేసుకుని మామిడి చెట్లకు స్ప్రే చేయడం జరుగుతుందని వివరించారు. ఇందుకోసం వివిధ రకాలుగా నిల్వ ఉంచిన పదార్థాలను వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రత్న ప్రసాద్‌, వర్ధక శాఖ అధికారి వెంకట్రావు లతోపాటు స్థానిక అధికారులు పాల్గొన్నారు.