ప్రజాశక్తి-నార్పల : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా నార్పలకు వస్తున్నట్లు తెలిసింది దీంతో మండల కేంద్రమైన నార్పలలో దశాబ్దాల కాలం నుండి సమస్యాత్మకంగా మారిన ప్రధాన సమస్య ఆయన అర్ధాంతరంగా నిర్మాణ పనులు ఆగిపోయిన కూతలేరు వంక వంతెన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణం సాగించి వంతెన దీనస్థితిని చూసి త్వరితగతిన వంతెనను పూర్తి చేస్తారా లేకపోతే ప్రజా ప్రతినిధులు అధికారులు ముఖ్యమంత్రి కూతలేరు వంక వంతెన పై ప్రయాణం చేయకుండా చూస్తారా అని నార్పల మండల వ్యాప్తంగా చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే సుమారు 40 గ్రామాలకు ప్రధాన కేంద్రమైన నార్పలకు ధర్మవరం తాడిపత్రి అనంతపురం తదితర పట్టణాలకు రాకపోకలు సాగించడానికి కూతలేరు వంతనే ప్రధానం వివరాల్లోకి వెళ్తే శిథిలావస్థకు చేరిన కుతలేరు వంతెనను పడగొట్టి నూతన వంతెన నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ శైలజనాథ్ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నార్పలకు వచ్చిన సమయంలో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి కూతలేరు వంక వంతెన పై నూతన వంతెనను నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి శాసన సభ్యురాలు యామిని బాల మరోసారి నూతనవంతన నిర్మాణ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు అయినా పనులు ప్రారంభం కాలేదు. ముచ్చటగా రాష్ట్రంలో మూడవ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది అయినా కూతలేరు వంతెన పనులు ప్రారంభం కాలేదు ఎలాగైనా కూతలేరు వంతెన పనులను తాను పూర్తి చేసి స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కుతలేరు వంతెన నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రెండు సంవత్సరాల క్రితం ఉన్న పాత వంతెనను తొలగించి ఎట్టకేలకు నూతన వంతెన పనులను ప్రారంభించారు. కర్ణుని మరణానికి సవాలక్ష కారణాలు అన్నచందంగా గత రెండు సంవత్సరాల నుండి కూతలేరు వంతెన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతూ....తూ....తూ....తూనే ఉన్నాయి. గతంలో ఉన్న పాలకులు నూతన వంతెన నిర్మాణానికి ప్రారంభోత్సవాలు చేసి పనులు ప్రారంభించకపోయినా గుడ్డి కన్నా మెల్లమేలు అన్న చందంగా పాత వంతెన పైనే అలాగే వాహనాల రాకపోకలు సాగించే వారని ప్రస్తుత పాలకుల నిర్వాకం వలన ఉన్న పాత వంతెన పోయే నూతనవంతన రాకపోయే అన్న విధంగా పరిస్థితి మారింది గతంలో కురిసిన వర్షాలకు రెండు సార్లు డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి నార్పల మండల వ్యాప్తంగా రాకపోకలు స్తంభించిపోయే పరిస్థితి కూడా సంభవించింది ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17వ తేదీన నార్పలకు వస్తున్నారు అంటే నార్పల కూతలేరు వంతెన ధీరస్థితిని ముఖ్యమంత్రి కల్లారా చూసి త్వరితగతిన వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తారని మండల వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన అసంపూర్తి గా నిలిచిపోయిన కూతలేరు వంతెన పై సాగకుండా ఉండే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు చూస్తున్నారని చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి సభా వేదిక అదేవిధంగా హెలిప్యాడ్ రెండు నార్పల క్రాసింగ్ లోనే ఏర్పాటు చేస్తారని లేని పక్షంలో హెలిప్యాడ్ సుల్తాన్ పేట సమీపంలో ఏర్పాటు చేసి బహిరంగ సభ వేదికను స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి అసంపూర్తిగా నిలిచిన కూతలేరు వంక వంతెనపై ప్రయాణం సాగించే అవకాశం ఉండదని అనుకుంటున్నారు. కాని ఎలాగైనా కూతలేరు వంతెన సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని పలువురు స్థానిక ప్రజలు తాపాత్రయ పడుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి పర్యటన కూతలేరు వంక వంతెన పైన సాగుతుందో లేదో తెలియాలి అంటే 17వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే అని పలువురు చర్చించుకుంటున్నారు..










