అనుకూలంగా రుతుపవనాలు
ముమ్మరంగా దుక్కులు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ అనుకూల ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. మరో వారం పదిరోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్‌కు అటు రైతాంగం ..ఇటు వ్యవశాయశాఖ సన్నద్ధమవుతోంది. గత ఖరీఫ్‌లో ఎదురయిన చేదు అనుభవాన్ని నెమరువేసుకుంటూనే అన్నదాతలు సాగుకు సన్నాహక చర్యలు ప్రారంభించారు. అధికారులు సైతం ఈ పనుల్లో నిగమ్నమయ్యారు. వెరసి జిల్లా అంతా ఖరీఫ్‌పై ముమ్మర కసరత్తు జరుగుతోంది. రైతులు తమపొలాలన్నింటినీ దుక్కులు దున్నుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ విత్తనాలు పంపిణీ చేస్తోంది.
ఖరీఫ్‌కు సంబంధించిన రుతుపవనాలు ఈ సారి బాగుంటుందని వాతవరణ శాఖ చెబుతోంది. దీనికి తగట్టుగా జిల్లా వ్యాప్తంగా రుతుపవనాల్లో భాగంగా అడపాడపా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువ మండలాల్లో వానలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతుండగా, మరి కొన్నింటిల్లో మేఘావృతమై.. చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు దుక్కులు దున్నుతున్నారు. పల్లెల్లో ఎక్కడ చూసినా యడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భూములు దున్నకాలు కనిపిస్తున్నాయి. అన్నదాతలు గత తాలుకు వర్షాభావాల కష్టాలను నెమరు వేసుకుంటూ ఈ సారైనా తమ బతుకులు బాగుపడకపోతాయా అనే ఆశతో ఖరీఫ్‌లో విత్తనాలు విత్తేందుకు సన్నాహాలు ప్రారంభించారు. రైతులకు కావాల్సిన సౌకర్యాలు అందించేందుకు జిల్లా వ్యవసాయశాఖ సన్నాహాలు ప్రారంభించింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖరీఫ్‌లో వేరుశనగను రైతులు భారీ ఎత్తున విత్తేవారు. అప్పుడు ఇక్కడ 1.30 లక్షల హెక్టార్లలో విత్తేవారు. దీనికి సంబంధించి విత్తనాలు, ఎరువులను అధికారులు సిద్ధం చేసే వారు. అయితే జిల్లాల విభజన తరువాత మన జిల్లాకు 55వేల661 హెక్టార్లు మాత్రమే మిగిలింది. సాధారణ విస్తీర్ణం 2.5 లక్షల హెక్టార్ల నుండి చెరకు కాకుండా మిగిలిన పంటలు 70వేల హెక్టార్లకే పరిమితమైపోయింది. మన జిల్లాకు సంబంధించి రాగి 4410 హెక్టార్లకు, కందులు 4178 హెక్టార్లు, పెసలు 265 హెక్టార్లు మాత్రమే మన జిల్లాకు వచ్చాయి. ఇవన్నీ 31 మండలాల్లోని రైతులు సాగు చేస్తారని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ పంపిణీ ప్రాంభమయ్యింది. విత్తనాలను బయోమెట్రిక్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక బస్తా విత్తనాలు ఇస్తున్నారు.
ఈసారి మెరుగైన పంటలు
వాతావరణ శాఖ అనుకూల హెచ్చరికల నేపథ్యంలో ఈ సారి జిల్లా వ్యాప్తంగా పంటలు బాగా పండుతాయి. రైతులకు వేరుశనగ విత్తనాలతో పాటు నవధాన్యాలు కూడా ఇస్తున్నాం. ఈ సారి రైతుకు మెరుగైన పంటల దిగుబడిరావొచ్చు.
మురళీ కృష్ణ, వ్యవసాయశాఖ జేడి










