Jul 28,2022 22:03

ఖరీఫ్‌ రైతు పై ధరల భారం
ఇది వరకే విత్తనాలు
ఇప్పుడు ఎరువులు
అల్లాడుతున్న రైతులు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

ఏటికాయేడు అన్నదాతలకు పెట్టుబడి గుదిబండగా మారిపోతోంది. మన జిల్లాలో ప్రధానంగా పండించే వేరుశనగ విత్తనాలు, ఎరువుల ధరలు మూడింతలు పెరిగిపోయాయి. అష్టకష్టాలు పడి, చెమటోడ్చి కష్టపడితే ఆఖరుకు పంట చేతికొచ్చే సరికి రైతుల కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. దీంతో సేద్యంపై విరక్తి చెంది పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. తాను కష్టాలు పడి జాతికంతటికీ ఆహారాన్ని ఇస్తున్న అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం క్రమంగా చేతులెత్తేస్తోంది. దీంతో ఆదుకునే వారు లేక రైతులు అల్లాడుతున్నారు.
ఖరీఫ్‌లో జిల్లాలో ఎక్కువగా వేరుశనగను సాగుచేస్తారు. మన జిల్లాలో 90శాతం మంది రైతులు వేరుశనగపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వీటి విత్తనాల ధరలు చుక్కలనంటాయి. మన జిల్లాలో ఎక్కువగా కె-6, టిఎజి-24, టిజి-32ఎ వంటి రకాలను ఉపయోగిస్తారు. వీటి ఈసారి విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది కన్నా ఈ సారి విత్తనాల ధరలు 400 రూపాయలు పెరిగింది. ఒక కేజీ పైన నాలుగు రూపాయలు గత ఏడాదితో పోల్చితే పెరిగిపోయింది. దీని వల్ల జిల్లాలో ఉన్న రైతులపై రెండు కోట్ల రూపాయలు భారం పడింది. గత ఏడాదితో పోల్చితే ఈ భారం అన్నదాతలకు భారంగా మారనుంది.
ఎరువులూ భారమే...
విత్తన భారాలతో తల్లడిల్లుతున్న అన్నదాత ఎరువులూ ఊపిరిసలపనివ్వడం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వీటిపై ఉన్న సబ్సిడీని రద్దు చేయడంతో ప్రయివేటు కంపెనీలు విపరీతంగా ధరను పెంచేస్తున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువులు రూ.1050ల నుంచి రూ.1392లకు పెరిగింది. అంటే గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రూ.342 పెరిగాయి. ఇక డిఎపి రూ.1192ల నుంచి 1342లకు పెరిగింది. అంటే దాదాపు రూ.150లు పెరిగింది. ఒక పొటాష్‌ రూ.950ల నుంచి ఏకంగా 1700లకు పెరిగింది. ఇందులో అత్యధికంగా రూ.950లు రైతులపై భారం పడింది. అటు విత్తన, ఇటు ఎరువుల ధరలు పెరిగిపోవడంతో అన్నదాతలు విలవిలలాడుతున్నాడు.