అనంతపురం ప్రతినిధి : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ ఆశలు ఆవిరయ్యాయి. సీజన్‌కు కీలకమైన జూన్, జులై మాసాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరులో పడినప్పటికీ సరైన పదును అవలేదు. ఈ ప్రభావం ఖరీఫ్ సాగుపై తీవ్రంగా పడింది. సాధారణ సాగులో 38 శాతం పంట సాగవలేదు. ప్రభుత్వమూ ప్రత్యామ్నాయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగానే మారుతోంది. సీజన్ ఆఖరులో వర్షాలు పడినపప్పటికీ చాలా చోట్ల ఇప్పటికీ పదును అవలేదు. ఇది సాగుపై ప్రభావాన్ని చూపింది.
38 శాతం బీడు
అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు ఈ ఏడాది 9.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకావముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాని సాగైంది కేవలం 5.67 లక్షల ఎకరాల్లోనే. 62 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా సాగయ్యేది వేరుశనగ పంట. 5.71 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవుతుందని అనుకుంటే 2.84 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. ఇప్పటికే వేరుశనగ సాగుకు సమయం కూడా మించిపోవడంపై ఇకపై సాగు విస్తీర్ణం వేరశనగ పడే అవకాశం లేదు. వరి సాగు కూడా 25 శాతానికే పరిమితమైంది. జిల్లాలో వరి ఖరీఫ్‌లో 43 వేల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా కేవలం పది వేల ఎకరాల్లోనే సాగైంది. ఇలా ప్రధాన పంటలు రెండూ సాగు పరిమితంగానే సాగవడం గమనార్హం. పత్తి పంట సాధారణ సాగు 1.27 లక్షల ఎకరాలు అవుతే ఇప్పటి వరకు సాగైంది 78 వేల ఎకరాల్లోనే.
పెరిగిన ఆముదం, కంది
అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయినప్పటికీ కంది, ఆముదం పంటల సాగు విస్తీర్ణం మాత్రం వంద శాతానికి దాటి సాగైంది. కంది పంట సాధారణ సాగు జిల్లాలో 74 వేల ఎకరాలవుతే 86 వేల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే 116 శాతం అధికంగా సాగైంది. ఆముదం పంట 30 వేల ఎకరాల్లో సాగైంది. 40 వేల ఎకరాల్లో సాగైంది. 133 శాతం అత్యధిక విస్తీర్ణంలో సాగైంది.ఇక తక్కిన పంటలన్నీ సాధారణం కంటే చాలా తక్కువగా సాగై ఉన్నాయి.
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి
చంద్రశేఖర్‌రెడ్డి ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి.
వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రైతలు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. పంటలు సాగు చేసుకోలేని పరిస్థితుల్లోనున్నారు. రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలతోపాటు పెట్టుబడి రాయితీని అందించి ఆదుకోవాలి.










