Jul 10,2022 23:05

ఖరీఫ్‌ ఆశాజనకం
వర్షాలు బాగా కురుస్తున్నాయి
వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

ఈ ఏడాది ఖరీఫ్‌ ఆశాజనకంగా ఉండబోతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు వేరుశెనగ వేసే పనిలో నిమగమయ్యారు. విత్తన పంపిణీ సకాలంలో రైతులు అందించడం జరిగింది. వాతావరణ పరస్థితులను బట్టి ఈ ఏడాది ఖరీప్‌ ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోందని వ్యవసాయశాఖ జేడి మురళీ కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ఆయన తెలియజేశారు.
ప్రజాశక్తి: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షపాతం ఎంత?
జేడి: ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. 1100 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కాగా 147 మి.మీ వర్షపాతం నమోదు కావడం జరిగింది. వేరుశనగ రైతులు వేరుశనగర విత్తనాలు వేసే పనిలో నిమగమయ్యారు.
ప్రజాశక్తి: జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం ఎంత?
జేడి: ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రస్తుతం 15,914 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా వరి 9,356 ఎకరాలు, వేరుశనగ 4,171.8 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతోంది. ఇతర పంటలు 2,386 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ప్రజాశక్తి: ఈ క్రాప్‌ బుకింగ్‌ ఎలా చేసుకోవాలి...?
జేడి: రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను తప్పనిసరిగా ఈక్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలని రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామస్థాయిలో వ్యవసాయ సహాయకుల ద్వారా ఈక్రాప్‌ బుకింగ్‌ చేయడం, యాప్‌లో నమోదు చేస్తున్నాం. ఈక్రాప్‌ బుకింగ్‌ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల భీమా, పంటనష్టం పెట్టుబడి రాయితీ, కనీస మద్దతు ధర, సున్నా వడ్డీ, పంట రుణాలు రైతులకు అందిస్తున్నాం. జిల్లాలో రబీ 2021లో 96,808 ఎకరాల ఈపంట యాప్‌లో నమోదు చేసి 56,789మంది రైతులకు ఆధార్‌తో అనుసంధానం చేశాం.
ప్రజాశక్తి: వైఎస్‌ఆర్‌ సున్నావడ్డి పంట రుణాలు ఎంత మందికి ఇచ్చారు?
జేడి: వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం రైతులు పంటలు వేసే సమయంలో పెట్టిబడిగా ఉపయోగపడుతోంది. లక్ష రూపాయలు రుణం తీసుకొని సంవత్సరం లోపు తిరిగీ చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. 2021 సంవత్సరం రబీలో 7,950మంది రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం ద్వారా 2.12 కోట్టు వడ్డీ రాయితీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశాం.
ప్రజాశక్తి: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా అమలు తీరు ఎలా ఉంది?
జేడి: రాష్ట్రప్రభుత్వం ఒక్కొక్క రైతు కుటుంబానికి కౌలు రైతులతో సహా ఏడాదికి రూ.13,500 ఆర్థికసాయం అందించేలా రైతు భరోసా పథకాన్ని 2019-20 ఆక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. భూమిలేని బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, కౌలురైతులకు ఏడాదికి రూ.13,500 ఆర్థికసాయం అదించడం జరుగుతోంది. 2019-20లో 1,9,730 మంది రైతులకు రూ.240.83 కోట్లు అందించాం.
ప్రజాశక్తి: రైతు భరోసా కేంద్రాలు ఎన్ని ప్రారంభించారు. నిర్మాణంలో ఎన్ని ఉన్నాయి?
జేడి: రైతుభరోసా కేంద్రాలు జిల్లాలో 251 ప్రారంభమైయ్యాయి. శాశ్వత ప్రాతిపదికన 246 నూతన రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రతి రైతుభరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకులను ఏర్పాటు చేశాం. ఈకేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, డిజిటల్‌ కియోస్కీ ద్వారా సరఫరా చేయడంతో రైతు విజ్ఞాన కేంద్రం నడుపుతున్నాం. అనుభవం కలిగిన శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.