ఖోఖో రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక
ప్రజాశక్తి- బంగారుపాళ్యం: రాష్ట్ర స్థాయి ఖోఖో జట్టుకు మండలంలోని టేకుమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సుభాన్ తెలిపారు. చిత్తూరులోని మెకానికల్ గ్రౌండ్లో శని, ఆదివారాలు జరిగిన సబ్‌జూనియర్ ఖోఖో పోటీలకు పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఎంపికయినట్టు తెలిపారు. వీరిలో పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులు అష్మిత, దివ్య, నిఖిత, ప్రచోదని, వర్షిణి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కాగా, బాలుర విభాగంలో ఏడో తరగతికి చెందిన వినరుకుమార్, ఎనిమిదవ తరగతికి చెందిన చరణ్ ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈనెల 26,27,28 తేదీలలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు దేవేంద్రను, ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ బందం, గ్రామస్తులు అభినందించారు.










