
* ఇన్వెస్టు ఇండియా టీం కమిటీ ప్రతినిధి ఆరాధన
ప్రజాశక్తి- పొందూరు, శ్రీకాకుళం అర్బన్: ఖాదీ, చేనేత రంగాల్లో నూతన ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఇన్వెస్టు ఇండియా టీం కమిటీ ప్రతినిధి ఆరాధన అన్నారు. చేనేత జౌళిశాఖ 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' కార్యక్రమంలో భాగంగా పొందూరు పట్టణంలోని ఏఎఫ్‌కేకే సంఘం, సాయిబాబా చేనేత సొసైటీల చీరలు, బట్టలు తయారీని శనివారం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పొందూరులో ఖాదీ, చేనేతల్లో తయారు చేస్తున్న చీరలు, బట్టలు నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాధీలో వస్త్రం తయారీకి అనుసరిస్తున్న వివిధ ప్రకియలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం, అవార్డుకు దేశవ్యాప్తంగా 506 ఉత్పత్తులు పోటీ పడగా, అందులో 60 ఉత్పత్తులు పరిశీలనలో ఉండగా, వాటిలో రాష్ట్రానికి సంబందించిన 14 ఉత్పత్తులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలపై ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. దీనిపై పలువురు చేనేత కార్మికులు మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఖాదీ వస్త్రాల తయారీపై యువత దూరం అవుతుండడంతో రానురానూ అంతరించిపోతుందని అన్నారు. యువతకు ఆకర్షించేలా వస్త్రాల తయారీ కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఖాదీ వస్త్రాల తయారీలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మజూరీ పెంచడం వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. అలాగే ముడిసరుకు సమస్యను పరిష్కరించడంతో పాటు కొత్త పరికరాలను అందించాలన్నారు. 50 ఏళ్లు నిండిన వడుకు కార్మికులకు పింఛన్‌ను అందించాలని కోరారు. ఈ సందర్భంగా పొందూరు ఖాధీ ప్రాముఖ్యతను ఏఎఫ్‌కేకే సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరప్రసాద్, దండా వెంకటరమణలు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జెసి ఎం.నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర, చేనేత జౌళిశాఖ జెడి కన్నబాబు, జోనల్ ఆఫీషర్ బి.ధనుంజయరావు, జిల్లా ఎడి ఐ.ధర్మారావు, తహశీల్దార్ వై.వి.ప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లా చేనేత ఉత్పత్తులు
అంతర్జాతీయ ఖ్యాతి
ఒక జిల్లా-ఒక ఉత్పత్తి అవార్డు (ఒడిఒపి)కి జాతీయ స్థాయిలో ఎంపిక కావడానికి జిల్లా ప్రాథమిక దశలో గుర్తించడం జరిగిందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు. జాతీయ అవార్డు నామినేషన్ పరిశీలనలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఆరాధన శర్మతో కలెక్టరేట్‌లోని సమావేశం నిర్వహించారు. ముందుగా కేంద్ర బృందం సభ్యులకు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న జిల్లా చేనేత ఉత్పత్తులు, ఎగుమతులపై వివరించారు.
అనంతరం పొందూరు ఖాదీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. ప్రభుత్వాలు అందిస్తున్న పింఛను, వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం, ముడి సరుకులు, ముద్ర పథకాలు, రాయితీలు వివరించారు. పొందూరు ఖాదీ ఉత్పత్తులపై శంకరరావు వివరించా రు. సమావేశంలో జెసి ఎ.నవీన్, చేనేత, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, సహాయ సంచాలకులు ధర్మారావు, పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఉమా మహేశ్వరరావు, డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేఖర్, శ్రీను, ఎడిఒ రమేష్, రమణ పాల్గొన్నారు.