ప్రజాశక్తి-అనంతపురం కుటుంబ నియంత్రణను బాధ్యతగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేస్తే ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్ తెలిపారు. ప్రపంచ జన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల పర్యావరణ పరిరక్షణకు, మానవాళి మనుగడకి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. ముఖ్యంగా భూమి, పర్యావరణపై అదనపు ఒత్తిడి పడుతుందన్నారు. అలాగే పేదరికం, పర్యావరణ క్షీణత, వనరుల క్షీణత, సామాజిక అసమానతులకు తావిస్తుందన్నారు. కావున జనాభా నియంత్రణ తాత్కాలిక, శాశ్వత పద్ధతులు పాటించాలని సూచించారు. ప్రోత్సాహకంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్న వారికి, చేస్తున్న వారికి రూ.2,500 నుంచి రూ.5వేల వరకూ నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుజాత, చెన్నకేశవులు, మనోజ్, డెమో ఉమాపతి, గంగాధర్, మారుతీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను విడుదల చేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్










