Aug 30,2022 22:14

కుప్పంలో పులి సంచారం..!
భయాందోళనలో స్థానిక ప్రజలు
ప్రజాశక్తి- కుప్పం:

కుప్పం పాతపేటలోని స్థానిక సోమేశ్వర దేవాలయంలో ఉదయం పులిని ఆలయ పూజారి గుర్తించారు. ప్రతి రోజులాగే ఉదయం ఆలయంలో పూజాకైంకర్యం కోసం ఆలయ తలుపులు తెరిచిన పూజారి ఆలయం వెనుక వైపు పులిని చూసి భయబ్రాంతులతో వెలుపలకు వచ్చి తలుపులు వేసి స్థానికులకు తెలిపారు. వారు అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకొన్ని అటవీశాఖ అధికారులు స్థానిక ప్రదేశంలో పులి సంచరిస్తునట్టు కాలి ముద్రలను చూసి నిర్ధారించారు. ఆలయంలో పులి ఉన్నట్టు స్థానికులు చెప్పడంతో సిబ్బంది లోపలికి వెళ్లి ఆలయ ప్రదేశాలను వెతికి చూడగా గోడపై పులి గోళ్ళ ముద్రలను గుర్తించారు. అలాగే పక్కనే ఉన్న కాళీస్థలంలోకి ప్రవేశించినట్టు గుర్తించిన అధికారులు జేసీబీతో చెట్ల పొదలను తొలగించారు. పులి కనిపించకపోవడంతో ఎటు వెళ్ళివుంటుందన్న ఆందోళన ప్రజల్లో ఎక్కువైంది. రాత్రి సమయాల్లో ప్రజలు ఒంటరిగా బయటరావొద్దని, పరిసర ప్రాంతాలను గాలించి త్వరలోనే పులిని పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా పట్టణసమీపంలో పులి సంచరించడం స్థానికులు భయాందోళనలో గురిచేసింది.