కుప్పంలో మళ్ళీ హైటెన్షన్
అర్థరాత్రి అన్న క్యాంటీస్ టెంట్లు ధ్వంసం
వైసిపి శ్రేణుల పనే అంటున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి- కుప్పం:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ టెంట్లను రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. దీంతో కుప్పంలో మళ్ళీ హైటెన్షన్ మొదలైంది. ఇదివరకే చంద్రబాబు పర్యటనలో ఉండగా అన్న క్యాంటీన్ బ్యానర్లను వైసీపీ నేతలు చించడంతో పెద్దఎతున్న నిరసన జ్వాలలు అలుముకున్నాయి. రాత్రి జరిగిన ఈదాడిని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పేదలకు అన్నంపెట్టే ప్రదేశాన్ని నాశనం చేయడం దారుణమని, ఇది ముమ్మాటికీ వైసీపీ శ్రేణుల పనేనంటు టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈదాడులకు నిరసనగా మంగళవారం కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పీస్.మునిరత్నం, మండల అధ్యక్షులు ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలి వరకు నల్లబ్యాడ్జిలతో ర్యాలీగా వచ్చి కుప్పం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోజూ అన్న క్యాంటీన్ ద్వారా సుమారు 500మందికి భోజనాన్ని అందిస్తుంటే పేదల నోటి దగ్గరి కూడును వైసీపీ నేతలు లాగేయడం హేయమైన చర్య అన్నారు. పేదల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినపడదా అని ప్రశ్నించారు. పక్కరాష్ట్రంలోని తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్‌ను నేటికీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆమె పేరుపైనే కొనసాగించడం ప్రశంసనియమని వారు గుర్తు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు అన్నం పెట్టె అన్న క్యాంటీన్లను రాష్ట్రం మొత్తం తొలగించిన ఘనత మన ముఖ్యమంత్రికే చెల్లుతుందని అన్నారు. కానీ కుప్పంలో టీడీపీ నేతలు సొంతనిధులతో ట్రాక్టర్‌పై వంటపాత్రలను ఏర్పాటు చేసుకొని దాతలచే ప్రతిరోజు స్థానిక బస్టాండ్ కూడలిలో అన్నం పంచిపెట్టి పేదల ఆకలి తీర్చే టెంట్లపై రాత్రి సమయాల్లో దాడులు చేయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దాడిచేసి టెంట్లను తొలగించిన వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను వారు కోరినట్టు తెలిపారు.










