కుప్పం అంగన్‌వాడీ ప్రాజెక్టు పరిధిలో...
పోస్టుల భర్తీలో డబ్బేడబ్బు
- కోర్టులో కేసు ఉన్నా ఇంటర్వ్యూలు - ప్రశ్నించిన వారిపై వేధింపులు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
కుప్పం అంగన్‌వాడీ ప్రాజెక్టు పరిధిలో పోస్టుల భర్తీలో అవినీతి కంపు కొడుతోంది. అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోవడం లేదు. అడ్డదారిలో పోస్టుల భర్తీకి ఇక్కడి అధికారులు పూనుకుంటున్నారు. వెంటనే దీన్ని ఆపాలని అంగన్‌వాడీ వర్కర్లు పోరాటం బాట పట్టారు. అయినా ఈ ప్రాజెక్టులో కీలకంగా ఓఅధికారి ఇంటర్వూలు నిర్వహించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుప్పం ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా అధికారులు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. 39 వర్కర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు అర్హులనుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు వాటిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది. కాగా ఆయా ప్రాంతాల్లో ఇది వరకు పని చేస్తున్న హెల్పర్లకు పోస్టులు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ఉన్న అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ పోస్టుల కోసం కొంత మంది కోర్టుకు కూడా వెళ్లారు. పదేళ్లకు పైగా అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్నామని, ఖాళీ స్థానాల్లో తమకు అవకాశం కల్పించాలని వారు డిమాండు చేస్తున్నారు.
అయితే ఇవేమీ పట్టని ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఓ అధికారి తన ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోకుండా పోస్టులను భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఖాళీ ఏర్పడిన వాటిల్లో ఒక్కో దానికి రూ.మూడు నుంచి రూ.ఐదు లక్షలు డిమాండు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన అప్లికేషన్లు మాత్రం ఫైనల్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా భర్తీ చేసిన అప్లికేషన్లు ఆఫీసులో చేర్చాలంటే కూడా రూ.5వేలు డిమాండు చేస్తున్నారని, దీని కోసం సిడిపిఓ కార్యాలయంలోనే ఓ అధికారి ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ పే చేయాలని ఉద్యోగార్తులను డిమాండు చేస్తున్నట్లు సమాచారం. ఈ అవకతవకలను ప్రశ్నించినందుకు వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అవినీతిపై చర్యలు తీసుకోవాలి
వాడ గంగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు
కుప్పం అంగన్‌వాడీ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలి. అర్హులకు అన్యాయం చేస్తూ డబ్బులు తీసుకుని అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రతి చిన్న పనికీ ఇక్కడ డబ్బులు డిమాండు చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.










