ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
కుప్పం అంగనవాడి ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఇంటర్వ్యూలు జరుగుతున్న ఆర్డిఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ధర్నాకు హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ నిజమైన అర్హులైన వారికి అన్యాయం చేస్తూ డబ్బులు తీసుకొని అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నారన్నారు. వీటితో పాటు ప్రతి చిన్న దానికి ప్రాజెక్టు కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను వేధిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి లీవులు కావాలన్నా, పర్మిషన్ కావాలన్నా ప్రాజెక్టు అధికారినే అడగాలని హుకుం జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక సూపర్‌వైజర్లు ఎందుకని ప్రశ్నించారు. అంగన్వాడి పోస్ట్‌లు అప్లై చేయడానికి కూడా కార్యాలయంలో డబ్బులు అడుగుతూ డబ్బులు లేవని చెప్పిన వారికి ఓ పోన్ నెంబర్ ఇచ్చి పోన్ పే చేయమని చెపుతున్నారంటే ఏ స్థాయిలో అవినీతి వుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. వీటిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ పీడీ నాగశైలజ స్పందిస్తూ అవినీతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి ప్రమీల, అధ్యక్షురాలు లలిత, నాయకులు కస్తూరి, సరళ పాల్గొన్నారు.










