Apr 30,2023 08:49

కూలిపోయిన పెన్న అహోబిలం రథం

         ఉరవకొండ : ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలంలో రథం(తేరు) శనివారం నాడు కుప్పకూలి కిందపడింది. మే 2వ తేదీన బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సంబంధించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథాన్ని మరమ్మతు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మే 10వ తేదీన బ్రహ్మ రథోత్సవం కార్యక్రమం జరగాల్సి ఉండగా ఇంతలో ఈ సంఘటన జరిగింది. 400 సంవత్సరాల క్రితం తయారుచేసిన ఈ రథం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త రథం తయారు చేయాలని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ అధికారులకు విరాళాలు అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా భక్తులు రూ.76లక్షలు రథం నిర్మాణానికి విరాళాల రూపంలో అందింది. ఇంత మొత్తంలో విరాళాలు అందినా కొత్త రథాన్ని తయారు చేయించడంలో ఆలయ అధికారులు జాప్యం చేశారు. శనివారం రోజు కూడా నిపుణుల పర్యవేక్షణ లేకుండానే కొంతమంది స్థానిక కార్పెంటర్లతో క్రేన్ల సహాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా మరమ్మతులు చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తుల నుంచి ఆదాయం వస్తోంది. దీంతో పాటు దాదాపు 2134 ఎకరాల దేవాలయ మాన్యం ఉంది. ఈ భూముల లీజుదారుల నుంచి సంవత్సరానికి 40 లక్షల రూపాయలు ఆదాయం వస్తోంది. అంతేకాకుండా సంవత్సరానికి హుండీ ద్వారా కోటి రూపాయల వరకు ఆదాయం వస్తోంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయానికి నూతన రథం తయారు చేయించడంలో దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి కారణం ఎమిటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
యథావిధిగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం
ఆలయ ఈవో విజరు కుమార్‌

మే 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే పెన్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో విజరు కుమార్‌ తెలిపారు. రథం కిందపడడంపై భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా స్థాయి దేవాదాయ శాఖ అధికారులు, స్థానికుల సహకారంతో రథోత్సవం యథావిదంగా జరిగేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.