కుప్పానికి హంద్రీనీవా జలాలొచ్చేనా..?
సిఎం ప్రకటనపై అంతటా చర్చ
నిధుల కొరతతో ఆగిపోయిన గండికోట కెనాల్
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
ముఖ్యమంత్రి ప్రకటన మేరకు కుప్పానికి హంద్రీనీవా జలాలు వస్తాయా అని అంతటా చర్చ సాగుతోంది. ఆరు నెలల్లో పనులు పూర్తవుతుందా...? ఇందులో ఎంతకాలం పట్టొచ్చు. ఒకవేళ పనులు పూర్తయినా ఇక్కడకు హంద్రీనీవా జలాలు వచ్చే పరిస్థితులున్నాయా అని జోరుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నిధుల కొరతతో గండికోట లింక్ కెనాల్ పనులు ఆగిపోయాయి. ఈపరిస్థితుల్లో కుప్పం కెనాల్ పనులు పూర్తయినా నీళ్లు వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
హంద్రీనీవా ప్రాజెక్టు.. ఇది కరువులో ఉన్న రాయలసీమకు అత్యంత ప్రాణదాయని. దీని నుంచి ఇక్కడి నాలుగు జిల్లాలకు 40 టిఎంసిల మిగులు జలాల కేటాయింపులున్నాయి. ఇందులో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు విడివిడి కేేటాయింపులున్నాయి. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 10 టిఎంసిల నీళ్లు ఇవ్వాల్సి ఉంది. కుప్పం బ్రాంచి కాలువ పనులు దాదాపు 70శాతం పూర్తయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఈకాలువల్లో నెలరోజుల పాటు నీళ్లు కూడా చూపించింది. చంద్రబాబునాయుడు ఎలాగైనా కుప్పం వాసులకు ఈ జలాలను చూపించాలని చకచకా పనులు చేయించారు. ఈ లోగా ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈనెల 23వ తేదీ కుప్పం పర్యటన సందర్భంగా ఈ కుప్పం బ్రాంచి కెనాల్ పనులు ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
జలాలకు ఇక్కట్లు..
రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడి, వరదలు పారితే హంద్రీనీవా కాలువలోకి నీళ్లు వస్తాయి. అది కూడా మన జిల్లా వరకు వచ్చేది అనుమానమే. గడిచిన ఐదేళ్లల్లో మూడుసార్లు వర్షాలు బాగా కురిసి మిగులు జలాలు వచ్చాయి. అయితే ఇవి మన జిల్లా సరిహద్దులోకి రావడానికి మూడు నెలలు పట్టింది. పుంగనూరు వరకు వచ్చి ఆగిపోయాయి. ముఖ్యంగా అత్యంత కరువు ప్రాంతంగా ఉన్న అనంతపురంలో కాలువల్లోకి నీళ్లు రాగానే ఇక్కడున్న రైతులు వాటిని పైపుల ద్వారా లాగేస్తున్నారు. చట్టబద్దంగా కేటాయించిన ఆయకట్టు భూములకే కాకుండా ఇతర వాటికీ తోడేస్తున్నారు. దీంతో మన జిల్లా వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ఆగిపోయిన గండికోట లింక్ కెనాల్ పనులు
ఇదిలా ఉంటే హంద్రీనీవా కాలువల్లోకి గాలేరు-నగరి కాలువ భాగంగా ఉన్న గండికోట రిజర్వాయర్ నుండి లింక్ కెనాల్ ద్వారా తీసుకొచ్చి చిత్తూరు జిల్లాలోని కాలువలకు కలిపే విధంగా వైసిపి ప్రభుత్వం పథకం రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు కూడా చేపట్టింది. అయితే లింక్ కెనాల్ కాలువ పనులకు, చిత్తూరు జిల్లాలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. దీంతో పనులు నత్తనడకన ఉన్నాయి. దీంతో గండికోట నుంచి హంద్రీనీవా కాలువల్లోకి నీళ్లువచ్చేందుకు అలసమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అవసరమైన నిధులు వెచ్చించి గండికోట లింక్ కెనాల్ పనులు పూర్తయితే తప్ప చిత్తూరు జిల్లాకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం బ్రాంచి కాలువ పనులు పూర్తయినా నీళ్లు వచ్చేది మాత్రం గగనమేనని వారు అంటున్నారు.










