Jul 17,2023 22:36

సెల్ఫీ చాలెంజ్‌ ఫొటో తీసుకుంటున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

          ప్రజాశక్తి-రాయదుర్గం   విప్‌ కాపు రామచంద్రారెడ్డి అసమర్ధత, చేతకానితనం వల్ల రాయదుర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. సెల్ఫీ ఛాలెంజిలో భాగంగా టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన బాదనహల్‌ వంతెన వద్ద సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని విడుదల చేశారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ దశాబ్ధాల కాలంగా రాయదుర్గం-బళ్లారి ప్రధాన రహదారి అత్యంత అధ్వాన్నంగా ఉండేదన్నారు. బాదనహల్‌ వంతెన కోసం అనేక సంవత్సరాలుగా ప్రతిపాదనలు చేస్తున్నారే తప్ప చేసింది లేదన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఆశీస్సులతో తాము రూ 8.60 కొట్లు వెచ్చించి వంతెనను పూర్తి చేసినట్లు తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 'కాపు' ఇలాంటి శాశ్వత పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తన స్థిర నివాసమైన బళ్లారి నుంచి నిత్యం రాయదుర్గానికి రాకపోకలు సాగిస్తున్న ''కాపు''నకు ఇలాంటి వంతెనలు నిర్మించాలనే ఆలోచన ఎందుకు రాలేదని నిలదీశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చేతనైతే కణేకల్లు వంతెనను నిర్మించాలని డిమాండ్‌ చేశారు.