ప్రజాశక్తి -ఉరవకొండ కూలీలను తీసుకెళుతున్న ఆటో బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన ఉరవకొండ పట్టణ శివారులో శనివారం చోటుచేసుకుంది. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పరిధిలోని పిసి ప్యాపిలి గ్రామానికి చెందిన 16 మంది కూలీలు మిర్చిపంట కోయడానికి శనివారం ఉదయం ఆటోలో విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి బయలుదేరారు. ఉరవకొండ సమీపంలో రాయంపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గంగన్న (60) మృతిచెందాడు. మల్లమ్మ (55), పెన్నక్క (56), చాకలి అంజనమ్మ (50), కుమారి (30) లు తీవ్రంగా గాయపడ్డారు. మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంగన్న (60) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.లక్ష ఇవ్వడంతో పాటు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఉరవకొండ సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి డిమాండ్ చేశారు. వారు ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను, మృతి చెందిన గంగన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్థానికంగా కూలి పనులు కల్పించకపోవడం వల్లే ప్రమాదానికి గురై కూలీలు మరణించారన్నారు. గ్రామాల్లో కూలి పనులు లేక కుటుంబాలను పోషించడానికి ఏమి చేయాలో దిక్కుతోచక ఆటోలలో ఇతర గ్రామాలకు పనుల కోసం వెళ్లాల్సిన పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయన్నారు. కూలీలు వెళ్తుతున్న ఆటోలు, ట్రాక్టర్లు ప్రమాదాలకు గురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన గంగన్న కుటుంబంతో పాటు క్షతగాత్రులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విశ్వ
ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. మృతి చెందిన గంగన్న కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందే విధంగా కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, పిసి ప్యాపిలి నాయకులు కృష్ణ, భీమప్ప, వీరా, రమేష్ తదితరులు ఉన్నారు.
ఉరవకొండ రోడ్డు ప్రమాద కూలీలను ఆదుకోండి
సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
ఉరవకొండ మండలం ప్యాపిలి కొత్తకోట ఉంచి పాల్తూరు గ్రామానికి వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉరవకొండ వద్ద జరిగిన ప్రమాదంలో కూలీ గంగన్న అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. మృతి చెందిన కూలీ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలన్నారు. గాయపడిన కూలీల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ కూలీలకు సొంత గ్రామాల్లో పనులు లేక సుదూరు ప్రాంతాలకు ఆటోల్లో ఎక్కువ మంది ప్రయాణం చేయడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గతంలో పామిడి, గుత్తి, వైటి.చెరువు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణంచారన్నారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతున్న అధికారుల్లో చలనం లేదన్నారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తే కూలీలు పక్క ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాల్లో విరివిగా ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.










