అనంతపురం ప్రతినిధి : మండుటెండలు తీవ్ర స్థాయి ఉన్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే భానుడి భగభగలుంటున్నాయి. జిల్లాలో 40 డిగ్రీలకుపైగా ఎండలు మండుతున్నాయి. ఇటువంటి సమయంలో మండుటెండల్లో పనిచేసే కూలీలకు పని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన కనీస సౌకర్యాలు ఏవీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ముళ్ల కంపలే టెంట్లు, ఇంటి నుంచి తెచ్చుకున్న లీటరు, రెండు లీటరు బాటిళ్లతోనే ఉపాధి కూలీలు దాహం తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి ఎండలకు ఎవరికైనా బెట్ట తగిలితే అందించేందుకు ప్రాథమిక కిట్లు కూడా ఏ ఒక్క చోట అందుబాటులో లేవు. ఉపాధి హామీ పనుల పరిశీలనలో భాగంగా శనివారం నాడు ప్రజాశక్తి పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల్లోనూ కూలీలకు వసతులు ఏర్పాటు చేయని పరిస్థితులే కన్పించాయి.
అనంతపురం జిల్లా పరిధిలో 3.1 లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఇందులో 2.57 లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌గానున్నాయి. సుమారు 4.62 లక్షల మంది కూలీలు ఉపాధి పథకం కింద పనిచేస్తుంటారు. ఇంత పెద్ద ఎత్తున కూలీలు పనిచేస్తున్నారు. ఉపాధి చట్టం ప్రకారం పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని చెబుతోంది. అయితే జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. టెంట్లు అన్నవే లేకుండా ఉన్నాయి. పని ప్రాంతాల్లో ముళ్ల కంప చెట్లు ఉంటే వాటి నీడనే ఎండ నుంచి కూలీలు రక్షణ పొందుతున్నారు. బుక్కరాయసముద్రం మండలంలో బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు సుమారు 270 మంది వరకు వీరభద్రస్వామి మాన్యంకు సంబంధించిన గుట్టలో ఫారంపాండ్ తవ్వుతున్నారు. ఇందులో 70 ఏళ్లకుపైగా వృద్ధులు మొదలుకుని 20 ఏళ్ల వయసు వరకున్న వారందరూ పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో పనిచేసే కూలీలను అడిగితే టెంట్లు ఏవీ లేవని, ప్రభుత్వం అటువంటివేవి ఏర్పాటు చేయలేదని చెప్పారు. మండుటెండలో నీరు ఎలాగంటే ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు వాటరు బాటిళ్లే అని చెప్పారు. ఆ చుట్టుపక్కల కిలోమీటరు పరిధిలో ఎక్కడా నీటి దొరికే పరిస్థితి కూడా లేదు. ఇక మెడికల్ కిట్ల అంశం అడిగితే అవేవీ ఇవ్వలేదని టీమ్‌లీడర్ చంద్రకళ తెలిపారు. ఇదే పరిస్థితి సిద్ధరాంపురం గ్రామం పరిధిలో చెరువు పూడిక తీస్తున్న వ్యవసాయ కూలీల పనిప్రదేశంలోనూ కన్పించింది. ఇక్కడ 300 మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరూ ఆరు కిలోమీటర్ల దూరం ఉండే కొండాపురం గ్రామం నుంచి ఆటోలో వస్తారు. ఇక్కడా నీడగాని, మెడికల్ కిట్లుగాని, అస్వస్తతకు గురైతే అందించేందుకు ఉండాల్సిన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లుగాని ఏవీలేవు. శింగనమల మండల కేంద్రంలో పనిచేసే వ్యవసాయ కూలీల పరిస్థితి ఇదే తీరున ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ఏ ప్రాంతాన్ని పరిశీలించినా ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలి
కృష్ణమూర్తి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.
ఉపాధి హామీ చట్టంలో వ్యవసాయ కూలీలకు అన్ని రకాల సౌకర్యాలూ కల్పించాలని చెబుతోంది. గతంలో ఇవి కల్పిస్తూ వచ్చారు. కాని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇప్పుడు క్రమక్రమంగా అన్నింటినీ తొలగించి వేస్తోంది. జిల్లాలో 40 డిగ్రీలకుపైగా ఎండలున్నాయి. ఇటువంటి సమయంలో జనం బయటకు రావాలంటనే భయపడిపోయే పరిస్థితులున్నాయి. ఇంతటి ఎండలో పనిచేసే కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కనీస వసతులను పనిచేసే ప్రాంతాల్లో కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.










