భీమలాపురం వద్ద పడవ బోల్తా : ఇద్దరు కూలీలు దుర్మరణం
ప్రజాశక్తి - ఆచంట
నిత్యం పొట్ట కూటి కోసం తప్పని ఫీట్లు.. గోదారమ్మే తమను కాపాడుతుందనే ధీమాతో ఆ కూలీలు తమ కుటుంబాల కడుపు నింపుకునేందుకు పనికెళ్లిన సందర్భంలో చోటుచేసుకున్న ప్రమాదంతో ఇద్దరు ప్రాణాలు నీళ్ల పాలయ్యాయి. ఒక కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోగా.. నా అనే వారు లేక తన భర్తే సర్వస్వంగా బతుకుతున్న గృహిణిని ఈ ప్రమాదం ఒంటరిగా నడిరోడ్డుపై నిలబెట్టింది. ఇదీ ఆచంట మండలం భీమలాపురం సమీపంలో గోదావరిలో చోటుచేసుకున్న పడవ ప్రమాదంలో మృతుల కుటుంబాల రోదన.
భీమలాపురం నుంచి ఉదయం 8.30 గంటలకు ఇంజిన్ పడవపై పడవ నడిపే వ్యక్తితో సహా మొత్తం ఆరుగురు మధ్యలంక వెళ్లారు. అక్కడ కొబ్బరికాయల లోడు వేసుకుని పది గంటల ప్రాంతంలో భీమలాపురం రేవుకు బయల్దేరారు. ఐదు కిలోమీటర్ల దూరమే కావడం, ప్రయాణం సాఫీగా సాగుతుండటంతో గోదావరి గాలికి కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ లోపు పడవలోకి నీళ్లు రావడం ప్రారంభమైంది. దీంతో ఎందుకైనా మంచిదని మరో పడవ తీసుకొస్తానంటూ ఈతొచ్చిన ఒకరు గోదావరిలోకి దూకి ఒడ్డుకు బయల్దేరారు. అదే సమయంలో కంగారుపడిన మిగిలిన వారు పడవలో ఒకవైపునకు రావడం, కొబ్బరికాయల లోడు ఎక్కువగా ఉండటంతో పడవ బోల్తా పడింది. భీమలాపురానికి చెందిన కొబ్బరి రైతు దేవి నాగరాజు, పడవ నడిపే కడలి బుల్లబ్బులు, కూలీలు జడ్డు సత్యనారాయణ, తాడికొండ సాంబశివరావు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈత రాని వల్లూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుడిపూడి పెద్దిరాజు (60), యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన సిరగం వెంకటరమణ (45) గల్లంతయ్యారు. ప్రమాదం విషయం తెలియగానే స్థానికులు, అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయానికి ప్రమాద స్థలికి సమీపంలోనే ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దిరాజుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరమణ భార్య మాత్రమే ఉంది. పిల్లలు, బంధువులు లేకపోవడంతో ఈ జంట ఒంటరిగా దొడ్డిపట్లలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మృతదేహాలను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలాన్ని నరసాపురం డిఎస్‌పి మనోహరాచారి, పాలకొల్లు సిఐ కొండవీటి శ్రీనివాస్, ఆచంట, పోడూరు, పెనుగొండ ఎస్‌ఐలు, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ జయలలిత, ఎఎంసి ఛైర్మన్ లావణ్య, సర్పంచి గుబ్బల మాధవరావు సందర్శించారు.










