Mar 21,2023 21:02

జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేసిన గొరగనమూడి గ్రామస్తులు
ప్రజాశక్తి - పాలకోడేరు
స్వామి జ్ఞానానంద వంటి మహనీయులు పుట్టిన గ్రామంలో గ్రామస్తులంతా కలిసి మెలిసి సోదరభావంతో జీవిస్తుంటే ఓ వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని గొరగనమూడి గ్రామస్తులు కోరారు. ఒక ఛానల్‌ అధినేత అని చెప్పుకుంటున్న రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో రాంబాబు వ్యవహరిస్తున్న తీరుపై గొరగనమూడి గ్రామస్తులంతా జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా మంగళవారం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్‌పికి అందజేసిన ఫిర్యాదు పత్రాలను విలేకరులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి గొట్టుముక్కల వెంకట శివరామరాజు (శివాజీ రాజు) మాట్లాడుతూ గ్రామంలో ఒక మహిళా వాలంటీర్‌ను అడ్డం పెట్టుకుని ఛానల్‌ అధినేతగా చలామణి అవుతున్న రాంబాబు ఓ ఇంటి నిర్మాణం విషయంలో జోక్యం చేసుకొని రౌడీయిజం చేసి గ్రామంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామంలో అందరూ కలిసి, మెలిసి సోదరుభావంతో జివిస్తుంటే తమ మధ్య కుల భావన తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇటీవల గ్రామంలో అన్ని కులాలతో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగిందని, రాంబాబుపై చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేసి జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశామని తెలిపారు. మాజీ సర్పంచి చెల్లబోయిన పాపారావు మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరుగా గ్రామం ఉందని, రాంబాబు అవలంబిస్తున్న తీరుతో గ్రామస్తులంతా విసుగు చెందారని తెలిపారు. తక్షణం రాంబాబుపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పివి.రావు మాల మహానాడు రాష్ట్ర నాయకులు పొన్నమండ బాలకృష్ణ, పద్మశాలిల సంఘం రాష్ట్ర నాయకులు బాల్లా పరమేశ్వరరావు మాట్లాడుతూ రాంబాబు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌చేసి గ్రామంలో ఉన్న అందరిపైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మీడియా ప్రతినిధులు వారధిగా ఉండాలని, కానీ గ్రామంలో రాంబాబు వ్యవహార శైలి దీనికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విస్సాకోడేరు సర్పంచి బొల్లా శ్రీనివాస్‌, దిడ్ల రవి, రామకృష్ణ, దొంగ సురేష్‌, మహంకాళి, బొల్లం గాంధీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.