Nov 02,2022 21:19

కట్టుకున్న భర్తే కడతేర్చాడు..
ప్రజాశక్తి- గంగవరం:
మండలంలో కల్లుపల్లి పంచాయతీ మల్లేరు గ్రామంలో అక్టోబర్‌ 30 తేదీన పట్టపగలే కత్తితో గొంతు కోసి రోజాను హత్యచేసిన ఆమె భర్త యాదగిరి, అత్తమామ ఆదినారాయణ, శాంతమ్మలను బుధవారం ఉదయం అరెస్ట్‌ చేసినట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం గంగవరం పోలీస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీతోపాటూ పలమనేరు రూరల్‌ సర్కిల్‌ సిఐ బి.అశోక్‌ కుమార్‌, గంగవరం ఎస్‌ఐ పివి.సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. యాదగిరి నుంచి హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ నిందితుడు యాదగిరి 2019 సంవత్సరంలో రోజా వివాహం చేసుకొన్నట్లు తెలిపారు. వివాహ సమయంలో రోజాకు, పుట్టింటి వారు పెట్టిన బంగారు నగలను యాదగిరి అతని తల్లిదండ్రుల సలహా మేరకు రోజాకు చెప్పకుండా అమ్మివేసినారు. తరువాత కొన్ని రోజులకు విషయం తెలిసిన రోజా, వారి పుట్టింటివారు సదరు నగలన్నీ తెచ్చి ఇవ్వమని అడుగుతుండగా, అప్పటి నుంచి యాదగిరి, అతని తమ్ముడు చోళరాజు, అతని తల్లిదండ్రులు రోజాను వేధించేవారు. రోజా తనకు రావలసిన నగలను తీసుకురమ్మని యాదగిరిని నిలదీయగా యాదగిరి కోపంతో పాత కోళ్ళఫారం పెడ్డులో ఉన్న మల్బరీ ఆకులను నరికే కత్తి తీసుకొని రోజాను గొంతు వద్ద నరికి హత్య చేసినట్లు చెప్పారు. ముద్దాయి యాదగిరి, ఆదినారాయణ శాంతమ్మలను కోర్టు ఎదుట హాజరుపర్చగా రిమాండుకు పంపినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు.