Jul 20,2022 22:21

క్షయ వ్యాధిగ్రస్తుల కోసం 'పలకరింపు' : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

క్షయవ్యాధిగ్రస్తులకు అందించే వైద్యసేవలతో పాటు వారి మానసిక స్థైర్యంను పెంపొందించేందుకు పలకరింపు కార్యక్రమంను చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలోని వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి క్షయ వ్యాధిగ్రస్తులకు అందించే వైద్యసేవలు ఇతర సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్‌ జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఆర్‌ఆర్‌ రెడ్డి, జిల్లా కుష్టు, హెచ్‌ఐవి, క్షయ విభాగాధిపతి డాక్టర్‌ రమేష్‌ బాబుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు అందించే వైద్యసేవలతో పాటు వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడం, వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఆశ, ఎఎన్‌ఎం వారి పరిధిలో గల క్షయ వ్యాధిగ్రస్తులను రోజూ పలకరించాలన్నారు. అలాగే ఎన్‌పిహెచ్‌ఎస్‌, ఎంఎల్‌హెచ్‌పి (మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌) 15 రోజులకు ఒకసారి, పిహెచ్‌సి డాక్టర్‌ నెలకు ఒకసారి పేషెంట్‌లను పరిశీలించి నోట్‌ స్కాన్‌ ద్వారా ఫోటో తీసి గూగుల్‌ షీట్‌ ద్వారా అప్‌ లోడ్‌ చేయాలని వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి అవసరమైతే జిల్లా ఆసుపత్రికి పంపాలన్నారు. దీనితో పాటు తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపి వారి ఊపిరితిత్తుల సామర్థ్యం పెంపొందించేలా అవసరమైన వ్యాయామాలు, పరికరాలైన స్కైరోమెట్రి అందజేయాలని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులను పరిశీలించిన సమయంలో వారికి అందించిన వైద్యసేవలు తదితరాలన్నింటినీ నిక్షరు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రభుత్వం వీరికి నెలకు రూ.500ల చొప్పున నిక్షరు పోషణ్‌ కింద ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారిని ఆదుకునేందుకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద స్వచ్చంద సంస్థలు లయన్స్‌ క్లబ్‌, రోటరీ క్లబ్‌ తదితర సంస్థల భాగస్వామ్యంతో నెలనెలా వీరికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేసేందుకు కషి చేయాలన్నారు. జిల్లాలో 1647మంది క్షయవ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందించడం జరుగుతున్నదన్నారు. ఈవ్యాధి తీవ్రమైన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వైద్య సవలను అందించడం జరుగుతున్నదని జిల్లా కుష్టు, హెచ్‌ఐవి, క్షయ విభాగాధిపతి రమేష్‌ కలెక్టర్‌కు వివరించారు.