Nov 29,2022 21:48

దుస్థితిలో ఉన్న కుర్చీలు

కష్టాల్లో సచివాలయాలు..!
- కనీసం కూర్చోడానికి కుర్చీల్లేవు
- నిధుల్లేక అల్లాడుతున్న వైనం
- సర్పంచులే దిక్కు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

ఈ చిత్రం బైరెడ్డిపల్లిలోని ఆలప్పల్లి సచివాలయంలోనిది. వివిద ప్రభుత్వ పనులకు ఇది ఎంతో కీలకం. నిత్యం ఇక్కడికి ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే కనీసం ఇక్కడ కూర్చునేందుకు కూర్చీలూ లేవు. సచివాలయాల ఏర్పాటప్పుడు సిద్ధం చేసిన సామగ్రిని వాడుతున్నారు. నాశిరకం వస్తువులు సరఫరా చేయడం వల్ల రెండేళ్లు కూడా నిలవకుండా పోయాయి. కొత్తవి కొనాలంటే గ్రామ సచివాలయాలకు నిధుల్లే కుండా పోయాయి. దీంతో ఇలా బొక్కలు పోయిన కుర్చీలనే వాడుకోవాల్సిన దుస్థితి నెలకుంది.
ఇది ఒక్క ఆలప్పల్లి గ్రామ సచివాలయానిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. నిధుల్లేక గ్రామ, వార్డు సచివాలయాలన్నీ ఇలా నీరించి పోతున్నారు. సిబ్బంది చేతినుంచి వేసుకోవాల్సిన దుస్థితి నెలకుంటోంది. ప్రత్యేక పద్దు కేటాయిస్తామని కొన్ని నెలలుగా చెబుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో పంచాయతీల నుంచి సర్దుబాటు చేస్తున్నారు. ఆడిట్‌ అభ్యంతరాలు వస్తుండడంతో కార్యదర్శులకు తలనొప్పిగా మారుతోంది.
జిల్లాలో 420 దాకా గ్రామ సచివాలయాలున్నాయి. ఒక్కో సచివాయలంలో పని చేస్తున్న సిబ్బదికి జీతాలకు రూ.5 లక్షల దాక ఖర్చు అవుతోంది. ఇది పక్కన పెడితే ఫాన్లు మరమ్మతు, బల్లలు, కుర్చీలు, కరెంటు బిల్లులు, గదులు, పరిసరప్రాంతాల శుభ్రత, తాగునీరు, తెల్లకాగితాలు, ప్రింటర్లు, కంప్యూటర్ల మరమ్మతులు రసాయనాల కొనుగోలుకు నెలకు రూ.5వేలకు పైగానే ఒక్కో సచివాలయానికి ఖర్చు అవుతోంది. వీటికి ఆయా సచివాలయాల్లో చిల్లిగవ్వ లేదు. కనీసం సచివాయలంలో ఉన్న సిబ్బందికి టీ ఖర్చులకూ డబ్బుల్లేని పరిస్థితి నెలకుంది. మూడు నెలలకు, ఐదు నెలలకుఒక సారి రూ.వెయ్యి మాత్రం ప్రభుత్వం వీటికి ఇస్తోంది. ఇవి ఏ మూలకీ చాలడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద పంచాయతీల్లో జనరల్‌ ఫండు నుంచి ఎలాగో ఒకలాగా సర్దుబాటు చేసుకుంటున్నారు. చిన్న పంచాయతీల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. చిన్న దానికీ వైసిపి నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలపైన ఆధారపడాల్సి వస్తోంది. ఒకటి రెండు సార్లు అయితే ఇస్తారు. అన్ని సార్లూ ఎలా సాధ్యమవుతుందని వారు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.