క్షేత్రస్థాయిలో పంటనష్టం పరిశీలన
ప్రజాశక్తి -రామకుప్పం: కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, ఎంఎల్‌సి భరత్‌తో కలసి బుధవారం క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పర్యటించారు. మొదట గొరివిమాకులపల్లెలో రైతు శ్రీనివాస్‌కు చెందిన రెండు ఎకరాల్లో దెబ్బతిన్న బంగాళా దుంప, మొక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం కెంపసముద్రంలో మునిరెడ్డికి చెందిన రెండు ఎకరాల్లో దెబ్బతిన్న మొక్క జొన్న పంటను పరిశీలించారు. మండలంలో 2.80 హెక్టార్ల వరి, 16.80 హెక్టార్ల మొక్కజొన్న మొత్తం 16 గ్రామాలలలో 18.80 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని మండల వ్యవసాయ అధికారి కలెక్టర్‌కు వివరించారు. రామకుప్పం-2 సచివాలయపరిధిలో మొక్కజొన్న, వరిపంట అధికంగా దెబ్బతిన్నదని అగ్రికల్చరల్ అసిస్టెంట్ కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ దెబ్బతిన్న ప్రతిసెంట్ భూమిలో నష్టపోయిన పంటను అంచనా వేయాలని, జిల్లాలో పంట నష్టం అంచనా ప్రక్రియ జరుగుతున్నదని, రైతులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం చేయూతను అందిస్తున్నదని తెలిపారు. అనంతరం కెంపసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1.04 కోట్లతో జరుగుతున్న నాడు-నేడు రెండవ విడత పనులను, 8 అదనపు తరగతి గదులు, కాంపోనెంట్ క్రింద చేస్తున్న 9 పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కొన్ని పనులను ప్రారంభించకపోవడంతో ఏఈ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులను ప్రారంభించాలని, లింటల్ లెవెల్ వరకు ఉన్న అదనపు తరగతి గదుల నిర్మాణంలో మోల్డింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. బైపరెడ్లపల్లి సచివాలయంను తనిఖీ చేయగా హౌస్ హౌల్డ్ మ్యాపింగ్‌లో కొత్తవారిని చేర్చడం, చనిపోయిన వారిని తొలగించడం జరిగిందని సచివాలయ సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. వర్షాల కారణంగా బురదమయమైన రోడ్లను శుభ్రం చేయాలని, ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్య ఎదుర్కోకుండా వారు తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన పెంచాలని వైద్యసిబ్బందికి, ఎన్యుమరేషన్ ప్రకియను పకడ్భందీగా చేయాలని అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పిల్లలకు అందిస్తున్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భవతులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని మెనూ ప్రకారం అందజేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖప్రసవం చేసేలా ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. కుప్పం మునిసిపల్ చైర్మన్ డాక్టర్ సుదీర్, ఎంఆర్‌ఓ సురేష్‌బాబు, ఎంపిడిఓ రాధాకష్ణ, ఎంపిపి సుబ్రహ్మణ్యం, జెడ్పిటిసి మిథున్‌రెడ్డి, ఎంఈఓ బాష, విజయపురం బాబు, చంద్రారెడ్డి, సర్పంచులు మురళి, ఆనంద్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తుపాన్ బాధితులకు అండగా ప్రభుత్వం
జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు
వి.కోట: తుపాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. మాండూస్ తుపాన్ ప్రభావంతో వ్యవసాయ, అనుబంధ పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బుధవారం వి.కోట మండలంలో తుపాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్‌తో కలసి జడ్పీ ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తుపాన్ కారణంగా అత్యధికంగా వర్షపాతం నమోదైందని.. దీంతో అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ పంటలు అధికంగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన పంటను జిల్లా కలెక్టర్ తో కలసి పరిశీలించామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ ద్వారా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాండూస్ తుపాన్ కారణంగా ఈనెల 9 నుంచి 13వ తేదీవరకు జిల్లాలో వర్షాలు పడ్డాయని... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. వీరివెంట ఎంపీపీ యువరాజ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కైగల్ రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్
బైరెడ్డిపల్లి: మండలంలోని కైగల్ రిజర్వాయర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సాయంత్రం పరిశీలించారు. బైరెడ్డిపల్లి, వి.కోట మండలాల్లో తాగునీటి కోసం రిజర్వాయర్‌ను నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.23.46 కోట్లు వ్యయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి, ఇరిగేషన్ ఏఈ భరత్ పాల్గొన్నారు.










