Jul 30,2022 21:22

క్షేత్రస్థాయిలో పక్కాగా ఫీవర్‌ సర్వే : కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ :
సీజనల్‌ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు, కోవిడ్‌-19 కేసుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఫీవర్‌సర్వే పకడ్బందీగా చేపట్టాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు, స్వచ్ఛసర్వేక్షన్‌ అంశాలపై కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ శనివారం మధ్యాహ్నం వార్డు కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వార్డు, ఆరోగ్య కార్యదర్శులు ఆశ కార్యకర్తలు, వాలంటీర్లను సమన్వయం చేసుకొని ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలన్నారు. వార్డు పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వివరాలు నమోదు చేయాలన్నారు. కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతం చేయాలని, అర్హులైన వారికి బూస్టర్‌ డోస్‌ వేయించాలన్నారు. ఇదే సమయంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణలో భాగంగా వార్డు స్థాయిలో చేపట్టాల్సిన పారిశుద్ధ్య, దోమల నియంత్రణ కార్యక్రమాలపై వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు రోజువారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, ఆ మేరకు పనులు చేపట్టాలన్నారు. డోర్‌ టు డోర్‌ తడి, పొడిచెత్త సేకరణ వందశాతం చేపట్టాలన్నారు. వార్డు పరిధిలో జరిగే అన్ని కార్యక్రమాలను అడ్మిన్‌ కార్యదర్శులు పర్యవేక్షించాలని, ఫీవర్‌ సర్వే త్వరగా పూర్తి చేయించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎంహెచ్వో అనిల్‌ కుమార్‌, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.