క్షేత్రస్థాయిలో పక్కాగా ప్రభుత్వ కార్యక్రమాలు: కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని, ఇందు కోసం అధికారులు, వార్డుకార్యదర్శులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఫీవర్‌సర్వే, సిటిజెన్ ఔట్రీచ్ కార్యక్రమం, గడపగడపకు మన ప్రభుత్వం, కాపు నేస్తం, హౌసింగ్ కార్యక్రమాలపై కమిషనర్ నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లతో బుధవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అన్నివార్డుల్లో ఫీవర్‌సర్వే పక్కాగా చేయించాలన్నారు. స్థానికంగా క్లోరినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. ఈనెల 29,30వ తేదీల్లో సిటిజన్ ఔట్రీచ్‌కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసి, వారి సూచనలు స్వీకరించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అధికారులు, ఆయా వార్డుల కార్యదర్శులు, వాలంటీర్లు తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను అదే రోజు ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ఈనెల 29వ తేదీన నిర్వహించనున్న కాపు నేస్తం కార్యక్రమం విజయవంతం చేయడానికి వాలంటీర్లు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మెప్మా సీఎంఎం గోపి పాల్గొన్నారు.










