ప్రజాశక్తి-పెద్దపంజాణి (చిత్తూరు) : మహానాడు కార్యక్రమానికి వెళ్ళి తిరిగొస్తూ నెల్లూరు జిల్లాలోని మనబోలు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాద కారణంగా గుండెపోటుతో మృతి చెందిన టిడిపి సీనియర్ నేత చంద్రగిరి కృష్ణమూర్తి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మృతుని స్వగ్రామమైన పెద్దపంజాణి మండలం ముదరంపల్లె గ్రామంలో కృష్ణ మూర్తి భౌతికకాయాన్ని స్థానిక నాయకులతో కలసి సందర్శించినివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై టిడిపి జెండా కప్పి సంతాపాన్ని తెలియజేశారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు మృతుని కుటుంబీకులను ఫోన్ చేసి పరామర్శించారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరమని, మీ కుటుంబానికి టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పార్టీ తరపున రూ.5లక్షల ఎక్స్గ్రేషియాను ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు టౌన్ అధ్యక్షులు ఆనంద్, సోమశేఖర గౌడ్,బలరాం శెట్టి, ప్రధాన కార్యదర్శి చలపతి,ప్రతాప్ రెడ్డి నాయకులు శ్రీరాములు, మురహరి రెడ్డి,సుధాకర్ రెడ్డి, నందగోపాల్, వేమారెడ్డి, రామకృష్ణా, గణపతి,గంగప్పతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










