ప్రజాశక్తి - ఉండి
వివిధ రకాల పంటల సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు ఎంతగానో దోహదం చేస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు అన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఏర్పడి ఆదివారానికి 95 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో సాంకేతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 700 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయని ఏ ప్రాంతానికి అనుకూలమైన పంటల గురించి ఆ ప్రాంతంలోని శాస్త్రవేత్తలు రైతులకు పంటల సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించనున్నట్లు తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు, మహిళలకు, యువకులకు వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి వారి స్వయం ఉపాధికి బాటలు వేసేందుకు శాస్త్రవేత్తలు ఉన్నట్లు వారు తెలిపారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపక గురించి శిక్షణ తరగతులను ప్రారంభించామని తెలిపారు. ఈ పుట్టగొడుగుల్లో అనేక రకాలు ఉన్నాయని, వీటిలో పాల, ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంపకానికి అణువైనవని వారు తెలిపారు. ఈ పుట్టగొడుగుల పెంపకం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి గలవారు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి వారికి కావాల్సిన సాంకేతిక సలహాలు పొందాలని వారు తెలిపారు. అనంతరం క్షేత్ర సందర్శనతో పాటు డ్రోన్ టెక్నాలజీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్.డెబోరా మెస్సియానా, డాక్టర్ ఎ.శ్రీనివాస్, డాక్టర్ ఎ.రాజేష్, డాక్టర్ పి.వినయలక్ష్మి, బి.రజితారెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది, రైతులు, మహిళలు పాల్గొన్నారు.










