- సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
- భీమవరంలో కార్ల మార్క్స్ జయంతి వేడుక
ప్రజాశక్తి-భీమవరం : కమ్యూనిస్టు సిద్ధాంత కర్త, పీడిత ప్రజల విముక్తి కోసం శ్రమించిన కార్ల్ మార్క్స్ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో కార్ల్సం మార్క్స్ జయంతి వేడుకల శుక్రవారం ఘనంగా నిర్వహించరు. ఈ సందర్బంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బలరాం మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత మేధావి,కార్మిక వర్గ ప్రియ పుత్రుడు, ప్రపంచంలో గుర్తింపు పొందిన మహోన్నతుల్లో కార్ల్ మార్క్స్ ఒకరున్నారు. ప్రపంచ పీడిత ప్రజల విముక్తి కోసం తన మిత్రుడు ఎంగెల్స్ సహాకారంతో సిద్ధాంతాన్ని రచించారన్నారు. దీనినే మార్క్సిజం అని నేడు మనం పిలుస్తున్నామన్నారు. కార్మికవర్గం ఎలా దోపిడీకి గురవుతుంది, బడా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు శ్రామికుల్ని ఎలా దోచుకుంటున్నాయి, కార్మికులు ఎలా విముక్తి సాధించాలి, ఓకే గొప్ప సోషలిస్ట్ సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు అని ఎంగెల్స్ తో కలిసి కమ్యూనిస్టు ప్రణాళిక రచించారన్నారు. పెట్టుబడి గ్రంధం ద్వారా పెట్టుబడిదారీ విధానం యొక్క అవలక్షణాలను, కార్మికవర్గం పడుతున్న కష్టాల్ని, ప్రజలు, కార్మికులు ఎలా ఆర్ధిక దోపిడీకి గురవుతున్నారనే విషయాల్ని తెలిపారన్నారు. పెట్టుబడి గ్రంధం అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంధంగా అవతరించిందన్నారు. మార్క్స్, ఎంగెల్స్ తరువాత సోవియెట్ విప్లవానికి నాయకత్వం వహించిన లెనిన్ ఈ సిద్ధాంతాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు. అందుకనే మార్క్సిజం - లెనినిజం గా నేడు ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతుందన్నారు. కార్ల్ మార్క్స్ తన జీవితంలో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నారన్నారు. ధనవంతుల కుటుంబంలో పుట్టినా శ్రామిక ప్రజల విముక్తి కోసం అనేక కష్టాలను అనుభవించారన్నారు. అనేక దేశాల పాలక వర్గాలతో బహిష్కరణకు గురికాబడ్డారన్నారు. మార్క్స్ సహచరిణి జెన్నీ కూడా మార్క్స్ కష్టాల్లో పలు పంచుకున్నారన్నారు. కన్నబిడ్డలు కళ్ళముందే మరణించిన ఘటనలు మార్క్స్ జీవితంలో ఉన్నాయన్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో, శ్రామిక వర్గ సిద్ధాంతం కోసం, శ్రామిక వర్గ విముక్తి కోసం, సోషలిజం నిర్మాణం కోసం తన యావజ్జీవితాన్ని అంకితం చేశారన్నారు. మార్క్స్ కన్న కళలు నిజం చేసేందుకు అందరం పునరంకితమవుదామని బలరాం అన్నారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె ఎన్ వి గోపాలన్, చింతకాయల బాబురావు ,కర్రీ నాగేశ్వరరావు, బి. వాసుదేవరావు, పీవీ ప్రతాప్, సీనియర్ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు ఎం. వైకుంఠరావు, ఏ అజయ కుమారి, తవిటినాయుడు, జార్జి, బాలరాజు, జె.శ్రీనివాస్, డి.శ్రీనివాస్, జి.రామకృష్ణ, ఎస్.వెంకటేశ్వరరావు నాయకులు ఎస్.అశ్రీయ్య, పి.పుల్లారెడ్డి, పి. నర్సింహమూర్తి పాల్గొన్నారు.
- అకాల వర్షాల వల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సిపిఎం
అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేసారు. స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా బలరాం మాట్లాడుతూ మాసూళ్లకు వచ్చిన పంట, ధాన్యం రాశులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. సకాలంలో తగినన్ని సంచులు, మాసూళ్లకు వచ్చిన ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు చేయకపోవడం, వాహనాలు సమకూర్చక పోవడం, నిబంధనలు, షరతులు పెట్టి కొంత మేర కొనుగోళ్ళకు మాత్రమే ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. వీటివల అన్ని విధాలా రైతులు నష్టపోయారన్నారు. ఈ నష్టానికి ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాలన్నారు. రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి మద్దతు ధరకు ప్రభుత్వమే తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణం అందించాలన్నారు. నూక శాతంఎక్కువగా ఉందనే పేరుతో డబ్బులు వసూలు చేయొద్దని డిమాండ్ చేసారు. ఉపాధి కూలీలకు పని దినాలు, వేతనం పెంచాలని డిమాండ్ చేసారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వృత్తి దారులు, రైతులు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు.










