Sep 12,2023 22:24

బూర్జ మండలం అల్లెనలో ఇంజిన్‌తో వరి పంటకు నీరు పెడుతున్న రైతులు

* వర్షాభావంతో వేలాది ఎకరాల్లో పంటలు వేయని రైతులు
* సాగు నీరు కోసం అవస్థలు
* తీరిక లేని రెవెన్యూ మంత్రి ధర్మాన
* పలాస తప్ప జిల్లా సమస్యలు పట్టని మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అధిక శాతం మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఆరు మండలాల్లో కరువుఛాయలు కమ్ముకుంటున్నాయి. వేలాది ఎకరాల్లో నేటికీ విత్తనాలు వేయలేని పరిస్థితులున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు సైతం అడుగంటుతుండటంతో చెరువులు ఎండిపోతున్నాయి. దీంతో ఎండిపోతున్న పంటలను తడుపుకునే అవకాశం లేకుండా పోతోంది. మరోవైపు వంశధారలో నీరు పుష్కలంగా ఉన్నా, కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోవడం, షట్టర్లు లేకపోవడంతో శివారు భూములకు సాగునీరందడం లేదు. ఈ పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నా సమీక్షించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు అమాత్యులకు తీరిక లేకుండా పోయింది.

    జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 3,67,531 ఎకరాల్లో (84 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 3,39,468 ఎకరాల్లో (85 శాతం) సాగైంది. జిల్లాలో ఇప్పటివరకు కురిసిన వర్షపాతం మేరకు ఆరు మండలాల్లో కరువుఛాయలు అలుముకున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నాలుగు, పలాస, ఎచ్చెర్ల మండలాల్లో చెరొక మండలాలు ఉన్నాయి. వాటిలో కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, నందిగాం, జి.సిగడాం మండలాలు తీవ్ర వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 వేల ఎకరాల్లో పంటలు సాగు కాలేదని వ్యవసాయశాఖ నివేదికలు చెప్తున్నాయని. అందులో వరి పంటే 59 వేల ఎకరాలకు పైగా ఉంది. పంటలు సాగైనట్లు లెక్కలు చెప్తున్నా, కొన్నిచోట్ల ఎండిపోతున్నాయి.
సాగునీరందక రైతుల అవస్థలు
వర్షాధారంపై ఆధారపడిన మెట్ట ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులే సాగునీటి కాలువ కింద ఉన్న ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఒడిశాలో కాస్తాకూస్తో వర్షాలు పడుతుండడంతో హిరమండలం గొట్టాబ్యారేజీలో తగినంత నీటి నిల్వలు ఉండనే ఉన్నాయి. కాలువల్లోకి నీటిని విడిచిపెడుతున్నా అవి శివారు భూములను చేరడం లేదు. కాలువల్లో పెద్దఎత్తున పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వర్షాల్లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఇంజిన్లు పెట్టుకుని పొలాలను తడుపుకుంటున్నారు. కొన్నిచోట్ల ఆ అవకాశమూ లేకుండా పోయింది. వర్షాభావ పరిస్థితులతో పలు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చెరువులు ఎండిపోయాయి.
తీరిక లేని రెవెన్యూ మంత్రి ధర్మాన
జిల్లాలో క్రమేణా కరువు ఛాయలు అలుముకుంటుండడంతో ఏం చేయలో రైతులకు పాలువపోవడం లేదు. వ్యవసాయం, సాగునీటిపై చర్చించి రైతులకు భరోసా కల్పించాల్సిన జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై పోటీ పడి ప్రెస్‌మీట్లకు సమయం కేటాయిస్తున్న అమాత్యులు కరువు పరిస్థితులపై సమీక్షకు తీరిక లేకుండా పోయింది. ఈనెల ఎనిమిదో తేదీన జిల్లా నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశానికి హాజరు కానున్నట్లు తొలుత అధికారులకు చెప్పిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తర్వాత సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆ రోజు గారలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం, తర్వాత అదే రోజు శ్రీకాకుళం నగరంలో కొత్తగా నిర్మించిన ఓ ప్రయివేట్‌ ఆస్పత్రి ప్రారంభానికి సమయం వెచ్చించిన మంత్రి, రైతాంగ సమస్యలపై నిర్వహించిన సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. రెవెన్యూతో పాటు కరువు, విపత్తులను చూస్తున్న మంత్రి ధర్మాన హాజరైతే, జిల్లాలో ఉన్న పరిస్థితులు అర్థమై ఏం చేయాలో అధికారులకు ప్రత్యామ్నాయ చర్యలు సూచించే అవకాశం ఉండేది. కరువును ఎదుర్కోవడం, రైతులను ఆదుకోవడం వంటి అంశాలు చర్చకు వచ్చి ఒక పరిష్కారం దొరికేది. మంత్రి ధర్మాన గైర్హాజరు కావడంతో ఆ సమావేశం మొక్కుబడిగానే సాగింది. ఇప్పటికైనా వ్యవసాయ పరిస్థితులను సమీక్షిస్తే రైతులకు కొంతవరకైనా మేలు చేకూరుతుంది.
జిల్లా సమస్యలు పట్టని మంత్రి అప్పలరాజు
వ్యవసాయ సలహా మండలి సమావేశానికి పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు హాజరైనా పలాస నియోజకవర్గ దృష్టితోనే మాట్లాడారు తప్ప జిల్లా పరిస్థితులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తోటపల్లి, నారాయణపురం అంశాలు, అక్కడి రైతులతో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించారు. షట్టర్ల సమస్య వల్లే వంశధార కాలువుల ద్వారా శివారు భూములకు నీరు ఇవ్వలేకపోతున్నామని ఇంజినీరింగ్‌ అధికారులు దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే షట్టర్ల సమస్యపై అధికారులతో మాట్లాడి ఉంటే వంశధార ఆయకట్టు భూములు ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదు. షట్టర్ల సమస్య కంటే వర్షాభావ పరిస్థితులతో పంటలు వేయలేకపోయిన, వేసిన పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతులను ఏవిధంగా ఆదుకోవాలన్న అంశాలపై తొలుత ప్రాధాన్యం ఇస్తే రైతులకు కొంతైనా మేలు చేకూరుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.