అనంతపురం ప్రతినిధి : మూడు సంవత్సరాలుగా కరువు ఛాయలు లేవని అనుకుంటుండగానే కరువు మరోమారు ఉమ్మడి అనంతపురం జిల్లాను పలకరిస్తోంది. సీజన్ ముగుస్తున్నా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. ఈ ప్రభావం సాగుపై పడింది. జిల్లాలో సాధారణ సాగులోనే ఎనిమిది లక్షల ఎకరాల్లో ఇప్పటికీ విత్తనం పడలేదు. అందులో సత్యసాయి జిల్లాలో అయితే ఏకంగా 30 శాతమే సాగైంది. అనంతపురం జిల్లాలో 65 శాతం వరకు విత్తనం పడింది. సాగు విస్తీరణం గణనీయంగా తగ్గడం, వేసిన కొద్దిపాటి పంటలు కూడా ఎండదశలో ఉండడంతో ఈ సారి కరువు తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణ సాగు 16.16 లక్షలు. అయితే సాగైంది చూస్తే 8.01 లక్షల ఎకరాలు మాత్రమే. విభజిత జిల్లాల వారీగా చూస్తే సత్యసాయి జిల్లాలో ఏడు లక్షలు సాధారణ సాగయితే 2.07 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదు. ఇక అనంతపురం జిల్లాలో చూస్తే సాధారణ సాగు 9.15 లక్షల ఎకరాలయితే దాదాపు ఆరు లక్షల్లో పంటలు సాగయ్యాయి. ప్రధాన పంట వేరుశనగ 15.29 లక్షల ఎకరాలు సాధారణ సాగు అవ్వాల్సి ఉంది. 4.51 లక్షల ఎకరాల్లో సాగైంది. సత్యసాయి జిల్లాలో1.55 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఆగస్టు మొదటి వారం వరకు మాత్రమే వేరుశనగ సాగుకు అనువైన సమయం. ఆ సమయం వరకు కూడా వర్షాలు పడకపోవడంతో వేరుశనగపై ఆశలు ఆవిరయ్యాయి.
47 మండలాల్లో వర్షాభావం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాలుంటే 47 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఇందులో ప్రధానంగా ఆరు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 168 మిల్లీమీటర్లుకుగానూ 127 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం పడింది. 24.3 శాతం తక్కువ వర్షపాతం పడింది. ఈ జిల్లాలో 21 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఇక సత్యసాయి జిల్లాలో సాధారణ వర్షపాతం 189.2 మిల్లీమీటర్లకుగానూ 119.9 మిల్లీమీటర్లు పడింది. ఇందులో ఆరు మండలాల్లో 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది.
20 శాతం సబ్సిడీతో ప్రత్యామ్నాయ విత్తనాలు
ప్రధాన పంటల సాగుకు సమయం పూర్తవడంతో ప్రత్యమ్నాయ విత్తనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు సబ్సిడీని ఖరారు చేసింది. వరి విత్తనం కిలో రూ.37.80 పూర్తి స్థాయి ధర అయితే 80 శాతం సబ్సిడీ ప్రకారం రూ.30.24పోనూ రూ.7.56 నాన్ సబ్సిడీ మొత్తాన్ని ఇవ్వాలి. మినుములు, పెసలు కిలో రూ.117.50 పూర్తి స్థాయి ధర ప్రకారం సబ్సిడీ రూ.94 పోనూ నాన్ సబ్సిడీ రూ.23.50 రైతు చెల్లించాలి. కొర్ర కిలో పూర్తి ధర రూ.67.50కిగానూ సబ్సిడీ ధర రూ.54పోనూ రూ.13.50 నాన్ సబ్సిడీ ధర చెల్లించాలి.










