
ఆందోళన చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి- నందిగాం: నందిగాం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం నాయకులు సాంబమూర్తి, ఎపి రైతు సంఘం నాయకులు బి.వి.వాసుదేవరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ వై.వి.పద్మావతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాల శ్రమించి ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టారని అన్నారు. పొట్ట దశలో ఉండటంతో వంశధార నీరు రాకపోవడం, 70 రోజులుగా వర్షాలు కురకపోవడంతో పంటలు పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నందిగాం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం.బాలయ్య, వి.సింహాచలం పాల్గొన్నారు.