Oct 25,2023 23:18

సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు

* సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
* కాలువల మరమ్మతులు చేపట్టి శివారు భూములకు నీరు ఇవ్వాలి
* రెండో పంటకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలి
* అన్నిరకాల రుణాలు రద్దు చేయాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ :
శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఏడాది వర్షాల్లేక, కాలువల ద్వారా నీరందక జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో, కాలువలు బలహీనంగా ఉండడం వల్ల శివారు భూములకు నీరందడం లేదని తెలిపారు. వంశధార, నాగావళి నదుల్లో నీళ్లు ఉన్నా, నీటి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి, రైతుల పంటలకు నీరు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. వంశధార నదిలో 52.5 టిఎంసిల నీరు మన వాటా లభ్యమవుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 17 టిఎంసిలకు మించి నీరు వినియోగించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వంశధార కాలువలకు మరమ్మతులు చేయాలని, షట్టర్లను బిగించాలని గతంలో పలుమార్లు రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై పాలకుల నిర్లక్ష్యం జిల్లాకు శాపంగా మారిందన్నారు.
ఎడమ కాలువ ద్వారా 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా, అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి కరువు వల్ల తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యామ్నాయంగా రెండో పంటకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, అన్నిరకాల రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కాలువల మరమ్మతులు చేసి శివారు భూముల వరకు నీరు ఇవ్వాలని, ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేయాలని, ఉపాధి హామీ ద్వారా 200 రోజుల పనులు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని, పంటల బీమా రైతులందరికీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.