ప్రజాశక్తి-రాయదుర్గం కరోనా మొదటి, రెండవ దశల్లో ప్రాణాలను సైతం లెక్కజేయకుండా పట్టణ ప్రజలకు సేవలు అందించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కార్మికులతో కలిసి వినాయక కూడలి నుంచి పురపాలక సంఘం వరకూ ర్యాలీ చేరుకున్నారు. అనంతరం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు సేవలు అందించడానికి ఎంతో ధైర్యంగా కార్మికులు ముందుకు వచ్చి దాదాపు 11 నెలలపాటు పనులు చేశారన్నారు. వీరు కరోనా సోకి మృత్యువాత పడిన వారిని వారి బంధువులు తీసుకెళ్లకపోయినా వీరే ఖననం చేశారని గుర్తు చేశారు. అప్పుడే కాకుండా గత సంవత్సరం వర్షాకాలంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి పారిశుధ్యం పడకేసినప్పుడు, పట్టణంలో పెద్ద డ్రెయినేజీ కాలువల పూడికతీతలోనూ నెలరోజులపాటు పనిచేశారన్నారు. ఇలాంటి కార్మికులను విధుల నుంచి తొలగించడం బాధాకరమన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని గతేడాది నుండి అధికారులు, పాలకులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి పట్టణ జనాభా అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంపులో భాగంగా కరోనా సమయంలో పనిచేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీరి దీక్షకు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు రాము, మల్లేష్, నగేష్, డేవిడ్, తదితరులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయపుత్ర, తిప్పేస్వామి, రాజు, చిన్న నిర్మల, ధర్మేంద్ర, సీనా రమేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
రిలే దీక్షలు చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు










