ప్రజాశక్తి-తాడిపత్రి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని విశ్రాంత ఉపాధ్యాయులు శివయ్య, కత్తి రామచంద్రారెడ్డి, షామీర్‌బాషా, జయరామిరెడ్డి కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో స్థానిక సాయి చైతన్య పాఠశాల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడాకారులు ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్రీడాకారిణుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దీంతో చాలామంది క్రీడాకారిణులు క్రీడలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలన్నారు. అలా జరగాలంటే యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. అంతేగాకుండా శిబిరంలో శిక్షణ పొందిన అమీనా అండర్-19 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో అభినందించారు. ఈ కార్యక్రమలంఓ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వరుణ్, ఉచిత కబడ్డీ శిక్షణ శిబిరం కోచ్ నరసింహా, క్రీడాకారులు, విశ్రాంత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
శిక్షన పొందిన విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, అతిథులు










